ఆసియా (Asian Games) క్రీడల్లో భారత్ (India) కు పతకాల (Medals) పంట పండుతోంది. తాజాగా మహిళల 5000 మీటర్ల ఫైనల్ (Final) లో పారుల్ చౌదరి (Parul Choudari) సత్తా చాటారు. మొదట్లో నెమ్మదిగా పరుగెత్తినా చివర్లో చిరుత పులిలా పరుగెత్తి పసిడి పతకాన్ని అందుకుంది. జపాన్ కు చెందిన క్రీడాకారిణి రిరికా హిరోనకాను వెనక్కు నెట్టి 15.14. 75 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకున్నారు.
ఆసియా క్రీడల్లో ఆమెకు ఇది రెండో పతకం కావడం గమనార్హం. అంతకు ముందు 3000 మీటర్ల విభాగంలో పారుల్ సిల్వర్ మెడల్ అందుకున్నారు. ఇక జావెలిన్ త్రో విభాగంలో అన్ను రాణి పసిడి పతకాన్ని సాధించారు. డెకథ్లాన్ విభాగంలో తేజస్విన్ శంకర్ రజత పతకాన్ని అందుకున్నారు. 1974 తర్వాత డెకథ్లాన్ విభాగంలో పతకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
పురుషుల 800 మీటర్ల విభాగంలో మహ్మద్ అఫ్జల్ సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నారు. ట్రిపుల్ జంప్ విభాగంలో ప్రవీణ్ చిత్ర వేల్ కాంస్య పతకాన్ని సాధించారు. హిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో విథ్యా రామరాజ్ కాంస్య పతకం పొందారు. మహిళల 54 కేజీల బాక్సింగ్ విభాగంలో ప్రీతి, పురుషుల బాక్సింగ్ లో నరేందర్ కు కాంస్య పతకాలు వచ్చాయి.
స్క్వాష్‌లో యాంగ్ యోనెస్కో, లి డాంగ్ జన్ లపై 2-1 తేడాతో భారత జోడీ అనంత్ సింగ్, అభయ్ సింగ్ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్ లోకి ప్రవేశించింది. దీంతో భారత్ కు ఏదో ఒక పతకం లభించే అవకాశం ఉంది. దీంతో భారత్ పతకాల సంఖ్య 69కు చేరుకుంది. అందులో 15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్య పతకాలు వున్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ కు వచ్చిన అత్యధిక పతకాలు ఇవే కావడం గమనార్హం.