Telugu News » Congress : చర్చలు సఫలం.. రమేష్ రెడ్డికి కీలక హామీ..!

Congress : చర్చలు సఫలం.. రమేష్ రెడ్డికి కీలక హామీ..!

రమేష్ రెడ్డి అభిమానులు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

by admin
patel-ramesh-reddy-nomination-withdraw

– టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి
– రెబల్ అభ్యర్థిగా బరిలో!
– సూర్యాపేటకు ఏఐసీసీ దూతలు
– గేటు దగ్గరే ఆపేసిన రమేష్ రెడ్డి వర్గీయులు
– తోపులాటతో టెన్షన్ టెన్షన్
– తీవ్ర ఉత్కంఠ నడుమ చర్చలు సఫలం

సోనియాగాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా? అనే నినాదంతో ప్రచారంలో కేసీఆర్ (KCR) సర్కార్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీకి.. సొంత నేతల నుంచి చిక్కులు తప్పడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు ఇతర పార్టీలకు జంప్ అవుతుండగా.. మరికొందరు సైలెంట్ గా ఉండిపోయారు. కానీ, ఇంకొందరు మాత్రం పార్టీని వదల్లేక.. సైలెంట్ గా ఉండలేక.. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగి నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో వాళ్ల చేత నామినేషన్ల ఉపసంహకరణకు ఏఐసీసీ చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే సూర్యాపేట (Suryapet) రెబల్ అభ్యర్థి రమేష్ రెడ్డి (Ramesh Reddy) ఇంటికి వెళ్లారు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మల్లు రవి.

patel-ramesh-reddy-nomination-withdraw

రమేష్ రెడ్డి వర్గీయులు ఈ భేటీని అడ్డుకున్నారు. ముందు, వారిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత రమేష్ రెడ్డి సూచన మేరకు శాంతించి వెళ్లనిచ్చారు. చర్చలు జరుగుతున్న క్రమంలో బయట ఉన్న కార్యకర్తలు ఓపిక నశించి రాళ్లతో దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల్లో నామినేషన్ ఉపసంహరించుకోవద్దని.. ఒకవేళ అదే జరిగితే సూర్యాపేటలో తిరిగే పరిస్థితి లేదని రమేష్ రెడ్డికి సూచించారు.

ఓవైపు చర్చలు సాగుతుండగా.. రమేష్ రెడ్డి భార్య లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. సర్వే నివేదికలన్నీ తమకే అనుకూలంగా ఉన్నా కూడా.. దామోదర్ కు టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు అన్యాయం జరగడానికి కారణం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, రూ.30 కోట్లు తీసుకుని టికెట్ ఇప్పించారని ఆరోపించారు. రమేష్ రెడ్డి అభిమానులు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

చర్చల అనంతరం వెనక్కి తగ్గిన రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు మొగ్గు చూపారు. మల్లురవి, రోహిత్ చౌదరి బుజ్జగింపుతో నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఎంపీ టికెట్ ఇస్తామని రమేష్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో విత్ డ్రాకు ఒకే చెప్పారు. కేసీ వేణుగోపాల్, రేవంత్, ఉత్తమ్‌ తో చర్చించి కాంగ్రెస్ నేతలు ఈ మేరకు హామీ ఇచ్చారు. సూర్యాపేట టికెట్‌ కోసం రాంరెడ్డి దామోద‌ర్‌ రెడ్డి, ప‌టేల్ ర‌మేష్ రెడ్డి ఆశించారు. అయితే.. అధిష్టానం దామోద‌ర్‌ రెడ్డి వైపే మొగ్గు చూపింది. దీంతో రమేష్ రెడ్డి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు, అనుచ‌రులు క‌న్నీటిప‌ర్యంతం కావ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ క్రమంలో ఆయన ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు.

You may also like

Leave a Comment