– చంద్రబాబుతో పవన్ ములాఖత్
– బాలకృష్ణ, లోకేశ్ తో కలిసి భేటీ
– టీడీపీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు
– వైసీపీ అరాచక పాలనకు చరమగీతం..
– పాడుదామని ప్రజలకు పిలుపు
చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ తో ఏపీ అట్టుడుకుతుంటే.. ఇదే సమయంలో కీలక ప్రకటన చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). వచ్చే ఎన్నికల్లో జనసేన (Janasena), టీడీపీ (TDP) కలిసి వెళ్తాయని ప్రకటించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్ళాలనేదే తన కోరికని తెలిపారు. బాలకృష్ణ, లోకేశ్ తో కలిసి చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిశారు పవన్. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YCP) అరాచకాలను అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదన్నారు.
151 సీట్లు దౌర్జన్యం చేసే ఆర్థిక నేరస్థుడైన జగన్ కి ఇచ్చామని అన్నారు పవన్. వైసీపీకి అనుకూలంగా ఉండే క్రిమినల్స్ ను హెచ్చరిస్తున్నానని.. ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. జగన్ అరాచకాలను డీజీపీ, చీఫ్ సెక్రటరీ, అధికారులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి వస్తే అధికారుల పరిస్థితి తెలుసుకొండని హితబోధ చేశారు. జగన్ కు ఉన్నది ఆరు నెలలే అని.. కచ్చితంగా ఏ ఒక్కర్ని వదలమని వార్నింగ్ ఇచ్చారు. గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని అన్నారు.
అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్న పవన్.. ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చానని అన్నారు. సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడానని.. తాను తీసుకున్న నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయని.. దక్షిణాది నుంచి మోడీకి ముందుగా మద్దతు తెలిపిన వ్యక్తిని తానేనని గుర్తు చేశారు. ఆనాడు దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నానని.. ఆ సమయంలో తనను అందరూ తిట్టారన్నారు. ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గనన్న పవన్.. 2014లో బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చేందుకు కూడా ముఖ్యకారణం ఉందని తెలిపారు.
విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు సీఎం కావాలని అనుకున్నానని.. చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు గానీ.. ఆయన అనుభవం, సమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. ఆనాడు అభిప్రాయ బేధాలు, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదనే చంద్రబాబుతో విభేదించానని గుర్తు చేశారు. రూ.317 కోట్లు స్కామ్ అని చెబుతున్నారు.. ఎవరో చేసిన తప్పును బ్యాంకు ఛైర్మన్ కు అంటగడతామా? అని అన్నారు. చంద్రబాబు శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని వ్యాఖ్యానించారు. అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం ఆ బుదరను అందరిపైనా చల్లాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్.