– నిత్యం ఎన్నికల వాతావరణం అవాంఛనీయం
– సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా..
– పేపర్ లీకులు ఆగాలన్నా బీజేపీ రావాలి
– డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగుంటుంది
– తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తితో ఆంధ్రాలో పోరాడుతున్నా
– కౌలు రైతుల్ని చులకనగా చూడొద్దన్న పవన్
– కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం
తెలంగాణ (Telangana) వస్తే అవినీతి పోతుందని భావించామని.. గత పాలకులు చేసిన తప్పే మళ్లీ జరుగుతోందని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). గురువారం కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేపర్ లీకులతో యువత నష్టపోయిందని.. చాలామంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004 నుంచి అవినీతి కొండలా పెరిగిపోయిందని.. జలయజ్ఞంలో పెద్ద దోపిడీ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) లో మాత్రమే భూముల ధరలు పెరిగాయని.. జిల్లాల్లో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు.
కౌలు రైతుల్ని చులకనగా చూడొద్దన్న పవన్.. కేసీఆర్ (KCR), రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో తనకు పరిచయాలున్నాయని తెలిపారు. స్నేహం వేరు.. రాజకీయాలు వేరని అన్నారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్ ను గెలిపించాలని కోరారు. అలాగే, ఖమ్మం జిల్లాలో బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. ‘‘శివ అనే 16 ఏళ్ల చెంచు కుర్రాడు యురేనియం తవ్వకాలపై నన్ను కలిశాడు. తెలంగాణ యువత నిప్పు కణిక అనడానికి శివ నిదర్శనం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న.. దాశరథీ కృష్టమాచార్యులు నాకు స్ఫూర్తి. సనాతన ధర్మం.. సోషలిజం రెండూ నడప గలిగేది జనసేన. బీఆర్ఎస్ ని ఒక్కమాట అనక పోవడానికి కారణం నేను ఇక్కడ తిరగక పోవడం. దశాబ్దం వేచి చూశా. ఆంధ్రాలో అరాచకంపై పోరాటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాకు స్ఫూర్తి’ అని తెలిపారు.
తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని అన్నారు పవన్. ప్రతి చోట జనసేనకు బలం ఉందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పలు పార్టీలు కష్టపడ్డాయన్నారు. దశాబ్దం తరువాత ఇక్కడ రంగంలోకి వచ్చామని.. తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తితో ఆంధ్రాలో పోరాటం చేస్తున్నానని చెప్పారు. బీజేపీ పరిపాలన జరుగుతున్న రాష్ట్రాల్లో బీసీలకు ప్రాధాన్యత ఉందన్న ఆయన.. తన మద్దతు నరేంద్ర మోడీకి ఉంటుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ మీద గౌరవం, కేటీఆర్ మీద నమ్మకం ఉందని.. కానీ, బీజేపీ వల్లనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. 5 ఏళ్లకి ఒక్కసారి మాత్రమే ఎన్నికలు రావాలని.. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగుంటుందని కోరారు. ఎవ్వరు వచ్చినా.. రాక పోయినా దక్షిణాది నుంచి మోడీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ‘‘భవిష్యత్తు యువత అని చెప్పిన గద్దర్ కు జోహార్లు. నిధులు, నీళ్ళు, నియామకాలు నినాదంతో వచ్చిన తెలంగాణ అనుకున్న స్థాయిలో లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎన్నికల వాతావరణం అవాంఛనీయం. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా పేపర్ లీకులు లేకుండా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.