Telugu News » Kaleswaram : కాళేశ్వరం కష్టాలు.. సర్కారుపై ముప్పేట దాడి..!

Kaleswaram : కాళేశ్వరం కష్టాలు.. సర్కారుపై ముప్పేట దాడి..!

ఒకవేళ కోర్టు తమ పరిధిని దృష్టిలో ఉంచుకొని పిటిషన్ తిరస్కరించినా.. హైకోర్టులో అప్పీల్ కు వెళ్లేందుకు పిటిషనర్ సిద్ధమౌతున్నట్టు సమాచారం.

by admin

– అందరి టార్గెట్ కేసీఆర్
– కాళేశ్వరం లోపాలపై తీవ్ర వ్యతిరేకత
– ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
– సీఎస్ కు కీలక ఆదేశాలు
– భూపాలపల్లి కోర్టులో పిటిషన్
– కోర్టు తీర్పుపై ఉత్కంఠ
– న్యాయ పోరాటానికి సిద్ధమౌతున్న ప్రజా సంఘాలు

కాళేశ్వరం (Kaleswaram)… తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) కలల ప్రాజెక్ట్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుగా దీనిని 2006-2007లో మొదలుపెట్టినప్పుడు అంచనా వ్యయం రూ.17,875 కోట్లు. తరువాత రూ.38,500 కోట్లకు పెంచింది ప్రభుత్వం. తెలంగాణ (Telangana) ఏర్పడిన తరువాత నీటి లభ్యత, రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం రీడిజైనింగ్ చేసి అంచనా వ్యయాన్ని రూ.89,190 కోట్లకు పెంచింది. తర్వాత, కేంద్ర జలసంఘానికి సమర్పించిన ప్రాజెక్టు సమగ్ర నివేదికలో మళ్లీ సవరించిన అంచనా వ్యయాన్ని పేర్కొంది. అప్పటికి రూ.1.11 లక్షల కోట్లకు చేరుకొంది. రానున్న రోజుల్లో ఇది.. రూ.1.50 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణుల అంచనా. అయితే.. కాళేశ్వరంలో బయటపడ్డ లోపాలు కేసీఆర్ సర్కార్ కు తలనొప్పిగా తయారయ్యాయి.

irrigation secretarys letter to central team on medigadda issue

ఎన్నికల సమయంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగడంతో గతంలో పంప్ హౌస్ ల మునక, ఇంకా ఇతర లోపాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఓ అస్త్రంగా మలుచుకుని కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress) పార్టీ సీబీఐ (CBI) విచారణకు పట్టుబడుతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. దానిపై స్పందించిన కమిషన్.. కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్​ పై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ చీఫ్​ సెక్రటరీకి ఆదేశాలిచ్చింది. సీఈవో వికాస్​ రాజ్ (Vikas Raj)​ దీనికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా పంపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం బ్యారేజీకి బుంగ పడడం వంటి ఘటనలపై కాంగ్రెస్​ పార్టీ ఈసీకి లేఖ రాసింది. ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ‘మోస్ట్​ ఇమీడియట్​’ అని పేర్కొంటూ సీఎస్​ కు సీఈవో ఉత్తర్వులను జారీ చేశారు. ఏం చర్యలు తీసుకుంటున్నారో ఫిర్యాదుదారుకు తెలియజేయాలని అందులో సూచించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

మరోవైపు, వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లేలా చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దీన్ని అనుమతించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ కోర్టు ఎస్ఆర్ నెంబర్ 1969 కేటాయించింది. విచారణ కోసం లిస్టింగ్ కూడా చేసింది. ప్రతివాదులైన వారిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్ఐఆర్ చేసి విచారించేలా కోర్టు ఆదేశిస్తే.. ఇది సంచలనంగా మారనుంది. ఒకవేళ కోర్టు తమ పరిధిని దృష్టిలో ఉంచుకొని పిటిషన్ తిరస్కరించినా.. హైకోర్టులో అప్పీల్ కు వెళ్లేందుకు పిటిషనర్ సిద్ధమౌతున్నట్టు సమాచారం.

కాళేశ్వరం లోపాలతో ప్రజా ధనం వృధా అవుతోందని.. అసలు.. ఈ ప్రాజెక్ట్ ప్రజలకు భారమే కానీ.. ఉపయోగం కాదని.. ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. అధికారుల తప్పిదాలు, వారి అక్రమ సంపాదనపై కూడా ఫోకస్ పెట్టి దర్యాప్తు చేయాలని కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు ఇచ్చేందుకు చూస్తున్నారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్స్ నిర్మించవచ్చని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెప్తుండడంతో.. నిర్మాణ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఎల్ అండ్ టీ సంస్థను కూడా నాణ్యత విషయంలో తప్పుదారి పట్టించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈఎన్సీల వ్యవహారంపై విచారణ ముగిస్తే గానీ.. ఎక్కడెక్కడ ఎన్ని తప్పిదాలు చేశారో.. వాటిని ఎలా సరిదిద్దుకోవాల్సి ఉంటుందో బట్టబయలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

You may also like

Leave a Comment