– ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త లింక్స్
– నల్గొండలో కానిస్టేబుల్ అరెస్ట్
– వందల మంది ఫోన్ రికార్డ్స్ విని బెదిరింపులు
– ఎమ్మెల్సీ పాత్రపై అనుమానాలు
– త్వరలోనే నోటీసులకు ఛాన్స్
– అప్రూవర్లుగా మారిన ఇద్దరు ఓఎస్డీలు
– రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆసక్తికరంగా ట్యాపింగ్ కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. రాధా కిషన్ రావు నుంచి కస్టడీలో కీలక విషయాలు రాబట్టింది. ఆయన చెప్పిన సుప్రీమో ఎవరో తెలుసుకుని పక్కా ఆధారాలను సేకరిస్తోంది. అన్ని వైపుల నుంచి కూపీ లాగి అష్టదిగ్బంధనం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీకి బిగుస్తున్న ఉచ్చు
విదేశాల నుండి ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి ఓ ఎమ్మెల్సీ డబ్బులు సమకూర్చినట్టు గుర్తించింది దర్యాప్తు బృందం. హవాలా రూపంలో డబ్బులు సమకూర్చినట్టు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ప్రణీత్ రావుకు ఆ ఎమ్మెల్సీకి గల సంబంధాలపై ఆరా తీస్తోంది దర్యాప్తు బృందం. టెక్నాలజీ కొనుగోలు కోసం ఎమ్మెల్సీ ఎన్ని డబ్బులు సమకూర్చారన్నదానిపై వివరాలు రాబడుతోంది. త్వరలో ఆ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నట్టు సమాచారం. ఆయన్ను విచారిస్తే మరికొందరి పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఎవరి ఆదేశాల మేరకు డబ్బులు సమకూర్చాడు అనేదానిపై విచారించనుంది దర్యాప్తు బృందం.
అప్రూవర్లుగా ఇద్దరు ఓఎస్డీలు
ఎస్ఐబీలో ఓఎస్డీలుగా ఉన్న ఇద్దరు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ ఇంతవరకు పోలీసుల ముందుకు రాలేదు. ఇప్పటికీ వీరు ఓఎస్డీలుగానే కొనసాగుతున్నారు. అప్రూవర్స్ గా మారిపోతామనడమే దీనికి కారణమని భావిస్తున్నారు. దీంతో దర్యాప్తు అధికారులు కూడా వీరిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతోపాటు విచారణకు హాజరు కావాలనే నోటీసులు కూడా ఇవ్వడం లేదంటున్నారు.
నల్గొండ లింక్స్.. మరో కానిస్టేబుల్ అరెస్ట్
ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక నల్గొండలో లింక్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసులో నల్గొండ జిల్లాకు చెందిన మరో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. చాలామంది వ్యక్తిగత వివరాలను సేకరించి బ్లాక్ మెయిల్ చేసినట్టు విచారణలో బయటపడింది. జిల్లాలో పలు దందాల్లో జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారని గుర్తించారు పోలీసులు. వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డ్స్ విని బెదిరింపులకు పాల్పడి, భారీగా వసూళ్లకు పాల్పడ్డాడని తెలుసుకున్నారు.
నెక్స్ట్ ఎవరు..? గులాబీ నేతల అరెస్టులు ఉంటాయా?
ఇప్పటివరకు ట్యాపింగ్ కేసులో అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు, త్వరలోనే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకులను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ లింక్స్ గుర్తించిన పోలీసులు, వాళ్ల పైనున్న వాళ్ల వివరాలను రాబడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొన్న తుక్కుగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు చర్లపల్లి జైలే గతి అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను బట్టి ట్యాపింగ్ కేసును కేసీఆర్ అరెస్ట్ దాకా తీసుకెళ్లేలా మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టి రేవంత్ రెడ్డి అడుగులు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.