తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ప్రసిద్ది చెందిన దేవాలయం శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహా స్వామి(yadagiri gutta) ఆలయానికి సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆలయం లోపల మొబైల్స్(mobiles) వాడకాన్ని నిషేధిస్తూ(BAN) ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అయితే, యాదగిరి గుట్ట ప్రధాన ఆలయంలోకి గతంలోనూ మొబైల్స్‌ను అనుమతించేవారు కాదు. కానీ, ఈ నిబంధనలు కేవలం భక్తులకు మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. తాజాగా ఆలయ అధికారులు సరికొత్త మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేశారు.
ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్టిరియల్ సిబ్బంది, మతపరమైన సిబ్బంది, నాల్గవ తరగతి ఎస్పీఎఫ్, హోంగార్డ్స్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా మొబైల్స్ ఫోన్స్ ఆలయంలోకి తీసుకు రాకుండా నిషేధం విధించారు.
సోమవారం జరిగిన శాఖాధిపతుల సమావేశంలో చర్చించి అధికారులు ఈ మేరకు నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చించి యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా, అత్యంత వైభవంగా నిర్మించిన విషయం తెలిసిందే.