నేటికాలంలో మానవ మేధస్సు ఎంతగానో అభివృద్ధి చెందింది. అలవోకగా అంతరిక్షంలోకి వెళ్తున్నా.. కొన్ని నమ్మకాలు మాత్రం మనస్సుని అంటిపెట్టుకొనే ఉంటున్నాయి. అయితే ఈ విశ్వం ఒక రహస్యం.. ఇందులో ఎన్నో వింతలు.. విశేషాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి.. వాటిలో కొన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తోంది. వాటిపై లోకంలో తెగచర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటన మంచిర్యాల (Mancherial) జిల్లాలో చోటు చేసుకొంది..
చెన్నూరు (Chennur)..కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి అనే వ్యక్తి ఇంటి బోర్ (Bore) నుంచి, గులాబీ రంగు (pink Colour) నీరు రావడం స్థానికులని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్న రాత్రి వరకు స్వచ్చమైన నీరు వచ్చిన బోర్ నుంచి హఠాత్తుగా గులాబీ నీటి దార రావడం చారి కుటుంబసభ్యులను ఆందోళనకి గురిచేస్తోంది. అయితే ఆ ఇంటి పక్కనే ఉన్న కాలనీ వాసులు కూడా తమ బోరునుంచి అలాంటి నీళ్లే వస్తున్నాయేమో అని పరీక్షించారు..
కానీ కేవలం శ్రీనివాస చారి ఇంటి బోరునుంచి మాత్రమే గులాబీ రంగు నీరు రావడం వింతగా భావిస్తున్నారు. మరోవైపు కొందరు ఆ నీరు విషతుల్యమైందని అనుమానాలు వ్యక్తం చేస్తూ.. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ నీటిని పరీక్షించి కారణాలు తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. మరోవైపు గతంలో ఇలాంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా మూడు చోట్ల దర్శనమిచ్చాయి.
గుజరాత్ (Gujarat)లోని బనాస్ కంఠ జిల్లా సుయిగామ్ గ్రామ సమీపంలోని ఓ చెరువులో నీళ్ల రంగు సడన్‌గా మారిపోయింది. నీళ్లన్ని గులాబీ రంగులోకి మారాయి.. మహారాష్ట్రలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. బుల్దానా జిల్లాలోని లోణార్ చెరువులో నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయాయి. కాగా నాగపూర్‌లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు ఆ చెరువును పరిశోధించి.. ఓ రకమైన బాక్టీరియా కారణంగా ఇలా జరిగిందని సృష్టం చేశారు.
మరోవైపు అమెరికాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. హవాయిలోని ఓ చెరువులో నీళ్లు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారిపోయాయి. దీంతో ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ రంగంలోకి దిగి.. చెరువులో అధిక లవణీయత ఉన్న బాక్టీరియా కారణంగా నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయి ఉంటాయని భావించారు. అయితే ఇలా నీళ్లు గులాబీ రంగులోకి మారడానికి హలో బ్యాక్టీరియా కారణమని. ఇది ఏకకణ జీవి అని, దాని పెరుగుదల కారణంగానే నీళ్లు గులాబీ రంగులోకి మారుతాయని అమెరికా శాస్త్ర వేత్తలు చెపుతున్నారు.