దేశ వ్యాప్తంగా ఒకే సారి తొమ్మిది వందే భారత్ రైళ్ల (Vande Barath Trains) ను ప్రధాని మోడీ (PM MOdi)ప్రారంభించారు. ఈ వందే భారత్ రైళ్లను ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీ వర్చువల్ (Virtual) గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ నూతన రైళ్ల రాకతో పలు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెరగనుంది. పలు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.
వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ…… 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల వృద్ధి జరుగుతోందన్నారు. దేశంలో ఇప్పటికే 25 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. తాజాగా మరో తొమ్మిది రైళ్లు ఈ జాబితాలో చేరాయని పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను ఈ వందే భారత్ రైళ్లు కలిపే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.
ప్రధాని మోడీ ప్రారంభించిన వందే భారత్ రైళ్లలో ఉదయ్ పూర్- జైపూర్, తిరున్యవేలీ- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు, విజయవాడ-చెన్నై, పాట్నా-హౌరా, కాసర్ గఢ్-తిరువనంతపురం, రూర్కెలా-భువనేశ్వర్, రాంచీ-హౌరా, జామ్ నగర్- అహ్మదాబాద్ ఉన్నాయి. ఈ నూతన రైళ్లతో ఆయా మార్గాల్లో ప్రయాణ సమయం సుమారు రెండు నుంచి మూడు గంటలు తగ్గనుంది.
ఇది ఇలా వుంటే గత తొమ్మిదేండ్లలో దేశంలో రైల్వే వ్యవస్థలో ప్రధాని మోడీ అసాధారణ మార్పులు తీసుకు వచ్చారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ్ అన్నారు. ఇప్పుడు దేశంలోని రైల్వే స్టేషన్లు అన్నీ అత్యంత క్లీన్ గా నూతన సౌకర్యాలతో కలకలలాడుతున్నాయని వెల్లడించారు.