దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihar Vajpayee)కి పలువురు నివాళులు అర్పించారు. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ మెమోరియల్ వద్ద వాజ్ పేయికి ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) పుష్పాంజలి ఘటించారు. మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, కేంద్ర మంత్రులు అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకానికి నివాళులర్పించారు.
అంతకు ముందు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అటల్ జీ జయంతి సందర్భంగా ఈ దేశంలోని కుటుంబ సభ్యులందరి తరఫున తాను నివాళులర్పిస్తున్నానని చెప్పారు. దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో తన జీవితాంతం వాజ్ పేయి కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. అమృత్కాల్ సమయంలో వాజ్‌పేయీ అంకితభావం, సేవ దేశానికి స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు.
మరోవైపు స్వాతంత్ర్య సమర యోధుడు, విద్యావేత్త మదన్మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా మాలవీయాకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మాలవీయ సాటిలేని వ్యక్తిత్వం, పని దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుందని వెల్లడించారు. అంతకు ముందు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ మాట్లాడుతూ…. సుస్థిర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటాయో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో నిరూపించారని తెలిపారు.
ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోందన్నారు. వాజ్ పేయికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ పాట్నాలోని అటల్ పార్క్ వద్ద నివాళులర్పించారు. ఈరోజు దివంగత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి అని అన్నారు. తాను ఎంపీగా పని చేసిన సమయం నుంచి తనకు తెలుసన్నారు. ఆయన ప్రభుత్వంలో తాను కేంద్ర మంత్రిగా పని చేశానన్నారు. అటల్జీ తనను చాలా గౌరవించేవారన్నారు.
అటు గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా పనాజీలో వాజ్‌పేయీ చిత్రపటానికి నివాళులర్పించారు. సుపరిపాలన దినోత్సవం’ సందర్భంగా గోవా ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిందన్నారు. బీజేపీ నేతలందరికీ వాజ్‌పేయీ స్ఫూర్తిదాయకమన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించిన వ్యక్తి. 1999 నుంచి 2004 వరకు భారత ప్రధానిగా పని చేశారు. 2018 ఆగస్టు 16న దిల్లీలోని ఎయిమ్స్‌లో కన్ను మూశారు.