– బీజేపీతో దోస్తీ కోసం కేసీఆర్ ఢిల్లీ వచ్చారు
– ప్రజల అభిష్టం మేరకు నేను ఒప్పుకోలేదు
– అందుకే, బీఆర్ఎస్ నేతలు నన్ను పదేపదే తిడుతున్నారు
– ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను మా దరిదాపుల్లోకి రానివ్వం
– తెలంగాణ అంటే సంప్రదాయాలు, టెక్నాలజీ
– సీఎం మూఢ నమ్మకాలను పెంచేలా ప్రవర్తిసున్నారు
– మూఢ నమ్మకాల బానిస ముఖ్యమంత్రి అవసరమా?
– ఫాంహౌస్ నుంచి బయటకు రాని సీఎం అవసరమా?
– రాష్ట్ర ప్రజలను అడిగిన ప్రధాని మోడీ
– మహబూబాబాద్ లో ఎన్నికల ప్రచారం
తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరుకుంది. పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి. ఉన్న కొన్ని గంటలను వాడుకుని నాలుగు ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ (PM Modi).. కేసీఆర్ (KCR) పాలనపై విరుచుకుపడ్డారు. మహబూబాబాద్ (Mahabubabad) లో ఏర్పాటు చేసిన బీజేపీ (BJP) బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ పాలనలో అనేక స్కాములు జరిగాయన్నారు. తెలంగాణలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. ల్యాండ్, లిక్కర్, పేపర్ మాఫియాలను జైలుకు పంపిస్తామన్నారు.
తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని చెప్పారు మోడీ. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ఫాంహౌస్ సీఎంను అక్కడకే పంపిందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. శాంతి వ్యవస్థను నష్టం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల బంజారా జాతుల శ్రేయస్సును బీజేపీ కోరుకుంటుందని అన్నారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పటు చేశామని వివరించారు.
మాదిగల వర్గీకరణకు బీజేపీ సకరిస్తుందని.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలా? లేదా? అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తానన్న కేసీఆర్.. ప్రజలకు మోసాలు, కన్నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఫాంహౌస్ సీఎం అవసరంలేదన్న ప్రధాని మోడీ… బీజేపీతో దోస్తీ చేయాలని ఢిల్లీ వచ్చారన్నారు. కానీ, తాను ఒప్పుకోలేదని చెప్పారు. అయితే.. బీఆర్ఎస్ ను ఎన్డీఏలో చేర్చుకోలేదని తనను ఆపార్టీ నేతలు తిడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను తమ దరిదాపుల్లోకి రానివ్వమని స్పష్టం చేశారు. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నాశనం చేశాయన్నారు.
తెలంగాణ అంటే సంప్రదాయాలు, టెక్నాలజీల తెలంగాణ అని చెప్పారు. కానీ, ముఖ్యమంత్రి మూఢ నమ్మకాలను పెంచేలా ప్రవర్తిసున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మూఢ నమ్మకాలతో ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు. మూఢ నమ్మకాలకు బానిస అయిన ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఫాంహౌస్ నుంచి బయటకు రాని సీఎం మనకు అవసరమా? అని తెలుగులో మాట్లాడారు. డిసెంబర్ 3న కేసీఆర్ ను సాగనంపాలని పిలుపునిచ్చారు.