ప్రధాని మోడీ (PM Modi) సైనికులతో కలిసి దీపావళి (Deepawali) వేడుకలు జరుపుకుంటున్నారు. జవాన్లతో కలిసి దీపావళి జరుపుకునేందుకు గాను ప్రధాని మోడీ ఈ రోజ ఉదయం హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాకు చేరుకున్నారు. ఆ విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అక్కడ జవాన్లతో కలిసి దిగిన ఫోటోలను ప్రధాని మోడీ షేర్ చేశారు.
సైనిక దుస్తుల్లో ఉన్న ప్రధాని మోడీ జవాన్లతో ముచ్చటిస్తూ ఉండటం ఫోటోల్లో కనిపిస్తోంది. ఇది ఇలా వుంటే దీపావళి నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ మీ అందరి జీవితాల్లో అంతులేని ఆనందాన్ని నింపాలని, మంచి ఆరోగ్యాన్ని అందించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
మన ధైర్యమైన భద్రతా దళాలతో కలిసి తాను లెప్చాలో దీపావళి జరుపుకుంటున్నట్టు తెలిపారు. 2014లో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి ప్రతి ఏటా సైన్యంతో నరేంద్ర మోడీ దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. జవాన్లతో ప్రధాని దీపావళి జరుపుకోవడం వరుసగా ఇది తొమ్మిదవ సారి కావడం విశేషం.
2014లో ప్రధాని మోడీ మొదటి సారి సియాచిన్ ప్రాంతంలో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సంవత్సరం 1965 యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయాలను పురస్కరించుకుని పంజాబ్లోని మూడు స్మారక చిహ్నాలను మోడీ సందర్శించారు. 2016లో హిమాచల్ ప్రదేశ్ లో చైనా సరిహద్దుల్లోని సైనికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.
2017లో ఉత్తర కశ్మీర్ లోని గురేజ్ సెక్టార్ కు ప్రధాని మోడీ వెళ్లారు. 2018లో ఉత్తరాఖండ్ లోని హర్సిల్ ప్రాంతంలో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. 2019లో జమ్ము కశ్మీర్ లోని రాజౌరి ప్రాంతంలో సైనికులను ఆయన కలిశారు. 2020లో లాంగేవాలా, 2021లో కశ్మీర్ లోని నౌషెరా, 2022లో కార్గిల్ లో మోడీ దీపావళి జరుపుకున్నారు.