పార్లమెంట్‌లో విపక్ష ఎంపీ (MPS)లు రచ్చ చేస్తుండటంపై ప్రధాని మోడీ (PM Modi) స్పందించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో విపక్ష పార్టీలు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని అన్నారు. ఆ నిరాశతోనే ఇలా పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ప్రవర్తనతో 2024 సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లో వారి సంఖ్య మరింత తగ్గుతుందని అన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఎంపీల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనను సమర్థించే “ప్రయత్నాల”పట్ల ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారు, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వారు ఈ ఘటనను ఖండించాల్సిందేనని వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న పార్టీ ఆ ఘటనను బహిరంగంగా లేదా రహస్యంగా ఎలా సమర్థించగలదని ఆయన ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి సభలో ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు సమావేశాలను వరుసగా స్తంభింప చేస్తున్నాయి. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా జరగడం లేదు. ఈ క్రమంలో విపక్ష ఎంపీలను సభాధిపతులు సస్పెండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 141 మందిపై సస్పెన్షన్ వేటు పడింది.