అయోధ్యలో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. అయోధ్యకు రాముడొచ్చేశారని అన్నారు. శతాబ్దాల కల సాకారమైందన్న ఆయన.. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు హాజరవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. తన మనస్సు, శరీరమంతా బాల రాముడి రూపంపై ఉందన్నారు.
ఈ రోజు మనందరికీ రాముడి ఆశీర్వాదం లభించిందని.. జనవరి 22, 2024 చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని చెప్పారు మోడీ. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈరోజును ప్రజలు గుర్తించుకుంటారని.. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం దక్కదని తెలిపారు. రాముడు ఉన్నచోట తప్పకుండా హనుమంతుడు ఉంటాడన్న ఆయన.. ఎన్నో బలిదానాలతో అయోధ్య స్వప్నం సాకారమైందని వివరించారు. వాళ్ల ఆత్మలు ఇప్పుడు శాంతిస్తాయన్నారు. 500 ఏళ్లలో ఆలయ నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలు ఆలోచించాలని.. రాముడు 14 ఏళ్లు వనవాసం చేశారు, కానీ, అయోధ్యవాసులు 500 ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం వేచి చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
భారత న్యాయవ్యవస్థ వారి స్వప్నాన్ని సాకారం చేసిందన్న మోడీ.. రాజ్యాంగబంద్ధంగానే రామాలయం నిర్మించామని తెలిపారు. ఈ సందర్భంగా దేశమంతా దీపావళి జరుపుకోవాలని కోరారు. రాముడు ధనుష్కోడిని దాటినప్పుడు కాలచక్రం మారిందని.. 11 రోజుల దీక్ష సందర్భంగా రాముడితో అనుబంధమున్న క్షేత్రాలు దర్శించానని వివరించారు. ఆంధ్రాలో లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం సందర్శించినప్పుడు మధురానుభూతి కలిగిందన్నారు. 11 రోజుల్లో అనేక రాష్ట్రాల్లో పలు భాషల్లో రామాయణం విన్నానన్న ఆయన.. భాష ఏదైనా దేశంలో ప్రతీ ఒక్కరికి రాముడు ఆరాధ్య దైవమని తెలిపారు.
బాల రాముడి ప్రతిష్ఠ విజయం కాదు.. వినయానికి ప్రతీక అని అన్నారు ప్రధాని మోడీ. ఆలయ నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని.. అయినా చివరకు లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. రామాలయం నిర్మాణం జరిగితే దేశం తగులబడుతుందని కొందరు ప్రచారం చేశారని.. కానీ, అది వాస్తవం కాదని ఇప్పుడు తేలిపోయిందన్నారు. రామ మందిరాన్వ్యని తిరేకించిన వాళ్లు మనస్సు మార్చుకోవాలని హితవు పలికారు. రాముడు వివాదం కాదు.. సమాధానం అని తెలుసుకోవాలన్నారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వసుధైక కుటుంబానికి ప్రతీక అని.. ఇది కేవలం దేవుడి ఆలయం మాత్రమే కాదు.. భారతీయతకు నిదర్శనమని చెప్పారు.
‘‘రాముడే భారతీయ విధానం, రాముడే భారతీయ ఆలోచన విధానం. రాముడే శాశ్వతం.. రాముడే విశ్వం. అయోధ్యలో భవ్య రామ మందిరం పూర్తయింది. భవిష్యత్తు కార్యాచరణ ఏంటని ఈ నగరం దేశాన్ని ప్రశ్నిస్తుంది. ఇంతటితో ఆగేది లేదు.. కాలచక్రం మారుతోంది. మందిర నిర్మాణం పూర్తయ్యింది.. ఇక దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. రాముడి వనవాసం ఆదివాసీలతో అనుబంధం గుర్తు చేస్తుంది. రాముడి రాక కోసం వేచి చూసిన శబరి దీక్ష ఫలించింది. దేశంలో నిరాశావాదానికి ఇక చోటు లేదు. దేవుడి నుంచి దేశం కోసం.. రాముడి నుంచి రాష్ట్రం కోసం పని చేయాలి. గాయాలైనప్పటికీ జటాయువు రావణుడిని ఎదిరించింది’’ అని గుర్తు చేశారు ప్రధాని మోడీ.