దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం గమనార్హమే.
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపనకు హాజరైన భారత మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమి కోసం రూ. 121 కోట్లు ఖర్చు చేశారు.నిర్మాణానికి దాదాపు రూ.330 కోట్లు ఖర్చు చేయనున్నారు.స్టేడియం సీట్ల సామర్థ్యం 30 వేలు. స్టేడియంపైకప్పు అర్ధ చంద్రాకారంలో, ఫ్లడ్లైట్లు త్రిశూలం, కొన్ని నమూనాలను బిల్వ పత్రాలను పోలి వుండేలా నిర్మిస్తారు.
అలాగే, ఓ నిర్మాణాన్ని డమరుకం ఆకారంలో నిర్మించనున్నారు. మొత్తంగా ఈ స్టేడియం కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబిస్తుంది. డిసెంబరు 2025 నాటికి పూర్తవుతుంది.