సస్పెన్షన్ అనంతరం ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్ ఖర్ (Jagdeep Dhankhar)ను అనుకరిస్తూ అవహేళన చేసేలా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన చేష్టలపై దుమారం రేగుతోంది. ఈ చేష్టలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ ఖండించారు. ఎంపీల తీరు ఆమోదయోగ్యంగా లేదని విమర్శలు చేశారు. ఛైర్మెన్ స్థానంలో ఉన్న వ్యక్తిని అవమాన పరిచేలా మిమిక్రీ చేయడం దారుణమని అన్నారు.
ఇలాంటి చర్యలు సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు ఎంపీల చర్యను ద్రౌపది ముర్ము ఖండించారు. మన గౌరవనీయులైన ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీలు అవమానించిన తీరు చూసి తాను విస్తు పోయానని వెల్లడించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ భావాలను వ్యక్తీకరించేందుకు వారికి స్వేచ్ఛ ఉండాలని చెప్పారు.
కానీ వారి వ్యక్తీకరణ అనేది గౌరవ, మర్యాదలకు అనుగుణంగా నిబంధనలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. అది మనమంతా గర్వించదగ్గ పార్లమెంటరీ సంప్రదాయమని తెలిపారు. భారతదేశ ప్రజలు దానిని సమర్థిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మేరకు విషయాన్ని ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.
‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాకు ఫోన్ కాల్ చేశారు. కొందరు గౌరవనీయులైన ఎంపీలు, అది కూడా నిన్న పవిత్రమైన పార్లమెంట్ కాంప్లెక్స్‌లో చేసిన దారుణమైన నాటకాల పట్ల మోడీ తీవ్ర బాధను వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్లుగా తాను కూడా ఇలాంటి అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నానని ప్రధాని చెప్పారు. కానీ భారత ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవికి పార్లమెంట్‌లో ఇలా జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు’అని ట్వీట్ లో పేర్కొన్నారు.