ఒడిశా ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ సంస్థల్లో భారీగా నగదు పట్టుబడిన ఘటనపై ప్రధాని మోడీ (PM Modi) స్పందించారు. కాంగ్రెస్ సమర్పించు డబ్బు దోపిడీ అంటూ బీజేపీ చేసి వీడియోపై మోడీ స్పందిస్తూ….. ఈ పట్టుబడిన నగదును ప్రముఖ వెబ్ సిరీస్ మనీ హీస్ట్ (Money Heist)తో ప్రధాని పోల్చారు. ‘మనీ హీస్ట్’అనేది బ్యాంక్ దోపిడీల నేపథ్యంలో థ్రిల్లింగ్‌గా సాగే వెబ్‌సిరీస్.
దేశంలో కాంగ్రెస్ ఉండగా కల్పితమైన, ఊహాజనితమైన మనీ హీస్ట్ వెబ్ సిరీస్ ఎందుకంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 70 ఏండ్లుగా ఆ దొంగలు దోచుకుంటూనే ఉన్నారని మండిపడ్డారు. అంతకు ముందు కూడా సాహూ వ్యవహారంపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి పైసాను వెనక్కి రప్పిస్తామన్నారు. ఇది మోడీ ఇస్తున్న హామీ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై అటు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌లో జరిగిన అతి పెద్ద డబ్బు దోపిడీ గురించి ఈ దేశ ప్రజలకు ప్రధాని మోడీ వివరించాలని కోరింది. అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని గుర్తు చేస్తు ఈ మేరకు విమర్శలు గుప్పించింది. కాషాయ పార్టీ నుంచి అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున లబ్ది పొందిందని ఆరోపించింది.
అదానీ గ్రూప్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాని మోడీ ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపణలు గుప్పించారు. ఇది ఇలా వుంటే సాహు కంపెనీలో భారీ నగదు పట్టుబడిన నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని సాహును కాంగ్రెస్ ఆదేశించింది. అది ఆయన ప్రైవేట్ వ్యవహారమని, దానికి పార్టీతో సంబంధం లేదని వెల్లడించింది.