లోక్ సభ చివరి సమావేశాలు సజావుగా జరగాలన్నారు ప్రధాని మోడీ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో చర్చలకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు క్షమించరని.. నిర్మాణాత్మక విమర్శలను స్వీకరిస్తామని స్పష్టం చేశారు. భారత్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందన్న ఆయన.. దేశం ప్రగతి పథంలో కొత్త శిఖరాలను చేరుతోందని వివరించారు.
ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాల వల్ల లాభం చేకూరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మోడీ. పార్లమెంట్ సమావేశాల్లో పాజిటివ్ సమాచారాన్ని ఇచ్చిన ఎంపీలను ఎప్పటికీ అందరూ గుర్తుంచుకుంటారన్నారు. సభా సమావేశాలను అడ్డుకునేవాళ్లను గుర్తుంచుకోరని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో అందరినీ కలుపుకుని పోయేలా తమ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతామని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఎంపీలు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే వేడుకలను గుర్తు చేశారు. కర్తవ్యపథ్ లో నారీశక్తి ప్రదర్శన గురించి వివరించారు. శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించిన తొలి సమావేశాల్లో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరుతో మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి చారిత్రక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వికసిత భారతావనిని నిర్మించే పనిలో గడిచిన పదేళ్లలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ఉభయసభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.