అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ( Gurpatwant Singh Pannun)ను హత్యకు చేసేందుకు భారతీయుడు ఒకరు కుట్ర పన్నారన్న అమెరికా ఆరోపణలపై ప్రధాని మోడీ (PM Modi) స్పందించారు. ఈ ఆరోపణలను తాము పరిశీలిస్తామని వెల్లడించారు. కానీ కొన్ని సంఘటనలు భారత్, అగ్రరాజ్యం అమెరికా మధ్య సంబంధాలను దెబ్బతీయలేవని మోడీ స్పష్టం చేశారు.
గురు పత్వంత్ సింగ్ పన్నును హత మార్చేందుకు కుట్రలు జరిగాయని అమెరికా ఆరోపించింది. ఈ కుట్రలో భారత్ కు చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తి ప్రమేయం ఉందంటూ అమెరికా అటార్నీ కార్యాలయం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ కుట్రలో నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి నుంచి ఆదేశాలు కూడా అందాయని ఆరోపించింది.
తాజాగా ఈ ఆరోపణలపై ప్రధాని మోడీ మాట్లాడుతూ… హత్య కుట్రకు సంబంధించి ఎవరైనా సమాచారం ఇస్తే దాన్ని పరిశీలించేందుక తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత పౌరులు విదేశాల్లో మంచి లేదా చెడు పనులు చేసినట్టు తమకు సమాచారం ఇస్తే దాన్ని పరిశీలిస్తామన్నారు. చట్టానికి లోబడి పాలన చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మరోవైపు భారత్కు వ్యతిరేకంగా విదేశాల్లో కొన్ని ఉగ్రవాద గ్రూపులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొంత మంది హింసను ప్రేరేపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వెలుగుచూసిన కొన్ని ఘటనలు భారత్-అమెరికా దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపవని ఆయన తేల్చి చెప్పారు.