నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) స్పందించారు. బీజేపీ (BJP) తమ ప్రేమ, విశ్వాసం, ఆశీర్వాదాలను కురిపించినందుకు అన్ని రాష్ట్రాల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని అన్నారు. ముఖ్యంగా తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, మన యువ ఓటర్లకు హృదయపూర్వకంగా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలపై భారత ప్రజలకు విశ్వాసం ఉందని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. కార్యకర్తలంతా అద్భుతమైన పని తీరును కనబర్చారని ప్రశంసించారు. బీజేపీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ విధానాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరును కొనియాడారు.
బీజేపీకి మద్దతు పలికినందుకు తెలంగాణలోని సోదరీమణులకు ధన్యవాదాలు అని చెప్పారు. గత కొన్నేండ్లుగా ఈ మద్దతు పెరుగుతూ వస్తోందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్నారు. తెలంగాణతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రజల కోసం పని చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రతి బీజేపీ కార్యకర్త కృషిని తాను అభినందిస్తున్నానన్నారు.
అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా మనం ముందుకు సాగుతున్నామన్నారు. మనం ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అలసిపోకూడదన్నారు. మనం భారత్‌ను గెలిపించాలన్నారు. ఈ రోజు మనమంతా కలిసి ఈ దిశలో ఒక బలమైన అడుగు వేశామన్నారు.