సీఎం కేసీఆర్ (KCR) డబుల్ బెడ్రూం పథకం ప్రకటించగానే.. అప్పట్లో పేదలు సంబరపడ్డారు. తాము ఓ ఇంటివాళ్లం అవుతామని ఎంతో ఆశపడ్డారు. కానీ, వాళ్లు అనుకున్నదొక్కటి, అయినదొక్కటి. కొన్ని ఏరియాల్లో డబుల్ బెడ్రూం (Double Bedroom) ఇళ్లు కట్టి చాలా కాలమే అవుతున్నా వాటిని కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. మరికొన్నిచోట్ల అయితే నిర్మాణం మధ్యలోనే వదిలేయడంతో పశువుల కొట్టాల్లా మారాయనే విమర్శలు ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రజలకు సహనం నశించి బలవంతంగా గృహప్రవేశాలు చేస్తున్న పరిస్థితి.
తాజాగా కరీంనగర్ (Karimnagar) జిల్లా తీగల గుట్టపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర ఆందోళన చేపట్టారు మహిళలు. తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అందరూ కలిసి భోజనాలు చేశారు. నిర్మాణం పూర్తయినా ఇళ్లు కేటాయించకపోవడంపై ఇలా తమ నిరసనను కొనసాగించారు. కొందరైతే మెడపై కత్తులు పెట్టుకుని ఆందోళన చేశారు. మరికొందరు పురుగు మందు డబ్బాలతో అక్కడికి వచ్చారు. తమకు ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ.. ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులు అక్కడకు చేరుకుని మహిళలను పంపించేందుకు ప్రయత్నించారు. కానీ, వాళ్లు తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పడంతో బలవంతంగా వారిని అక్కడి నుంచి తీసుకెళ్ళారు. బాధితులు చెప్పిన దాని ప్రకారం.. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన ప్రాంతంలో 20 ఏళ్లుగా వారు గుడిసెలు వేసుకుని ఉండేవారు. ఆనాడు ఖాళీ చేయించిన నాయకులు, అధికారులు.. తమకే ఇళ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని అడుగుతుంటే.. దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లారని ఆరోపిస్తున్నారు.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రకటించారు కేసీఆర్. అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో కట్టిన ఇళ్లు కొన్నే. చాలా ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయినా కూడా లబ్ధిదారులకు కేటాయించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణంలో పెరిగిన ఖర్చు కారణంగా కొన్ని ఏరియాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు గృహలక్ష్మి అనే పథకాన్ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ప్రకటించినప్పుడు పూర్తిస్థాయిలో సాధ్యం అయ్యే పని కాదని కొందరు నేతలు, నిపుణులు హెచ్చరించినా కేసీఆర్ వినిపించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. డబ్బులు ఇస్తే ప్రజలే కట్టుకుంటారని సూచించినా వినిపించుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికీ చెబుతుంటారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల జనం ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు.