ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ (Accident)కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం కేసులో కొడుకును తప్పించబోయి మాజీ ఎమ్మెల్యే షకీల్ (EX MLA Shakeel) ఇరుక్కున్నారు. కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం షకీల్ దుబాయ్‌లో ఉన్నారు. స్వదేశానికి తిరిగి రాగానే షకీల్ ను విచారణకు పిలవాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. డిసెంబర్ 24 ఆదివారం రాత్రి ప్రజాభవన్ వద్ద ఓ కారు వేగంగా వచ్చి బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నడిపింది షకీల్ కుమారుడు సోహెల్ గా పోలీసులు గుర్తించారు.
ఇది ఇలా వుంటే తానే కారు డ్రైవ్ చేశానని షకీల్ ఇంట్లో డ్రైవర్ గా పని చేసే వ్యక్తి పోలీసుల ముందుకు వచ్చారు. కానీ కారు నడిపింది సోహెల్ అని పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ద్వారా గుర్తించారు. పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు షకీల్ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు షకీల్ ప్రయత్నించినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే దుబాయ్ నుంచి షకీల్ తన ఇంట్లో పని మనుషులకు, సిబ్బందికి ఫోన్ చేసినట్టు పోలీసులు నిర్దారించారు. ఈ క్రమంలో కొడుకును తప్పించేందుకు ప్రయత్నించినందుకు గాను ఈ కేసులో షకీల్ పేరును కూడా చేర్చారు.