– మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం
– త్వరలోనే నివేదిక తయారీ
– ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆడుకుంటున్న విపక్షాలు
– కేంద్ర నివేదికపై ఉత్కంఠ
– ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు భారీ డ్యామేజ్
– కేసీఆర్ టార్గెట్ గా విపక్షాల మాటల దాడి
కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్.. తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్తూ ఉంటుంది. గత ఎన్నికల్లో ఈ అంశం బీఆర్ఎస్ (BRS) గెలుపుని ప్రభావితం చేసింది. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రంలో సాగు, తాగు నీటికి తమ పార్టీ ఎంత చిత్తశుద్దిగా పనిచేస్తుందో ప్రజలు గమనించాలి అంటూ కేసీఆర్ (KCR) తెగ ప్రచారం చేశారు. సరిగ్గా ఈసారి ఎన్నికల సమయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. అయితే.. ప్రాజెక్టులో బయటపడిన లోపాలు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారడంతో కేసీఆర్ ఇరుకున పడ్డారు.
ప్రాజెక్టులో అతికీలకమైన మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్ట్ కుంగిన నేపథ్యంలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) నేతలు ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకుంటున్నారు. కేసీఆర్ అసమర్ధతకు ఇది చక్కని ఉదాహరణ అని.. దీని బాధ్యత అంతా ఆయనే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడేశారని తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. సరిగ్గా ఇదే టైమ్ లో కేంద్రం ఎంట్రీ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగుబాటును క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు.. కేంద్ర బృందంతో కలిసి పరిశీలించారు.
జరిగిన నష్టం, బ్యారేజీ పటిష్టత తదితర అంశాలను కేంద్ర కమిటీ సభ్యులు కూలంకశంగా తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యతపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ.. ఈ కమిటీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు రోజుల్లో కమిటీ నివేదక కూడా ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మరింత దూకుడు పెంచుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే పనిలో పడ్డాయి. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారానికి కాళేశ్వరం ఇప్పుడు ఒక ఆవుయుపట్టుగా మారింది.
నాణ్యత లేని ప్రాజెక్టులతో ప్రజలను నిండాముంచి కేసీఆర్ తన కుటుంబానికి మాత్రం బంగారు బాట వేసుకున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రానికే తలమానికంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడితే.. విపక్షాల ఎన్నికల ప్రచార వేడిని తట్టుకోవడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోయింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశయంలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరడం వల్ల పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర నిపుణుల బృందం ఒక పిల్లరు మాత్రమే దెబ్బతిందని, బ్యారేజీ పటిష్టతకు ఢోకా లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు కేంద్ర బృందం ఇచ్చే నివేదికపై సస్పెన్స్ కొనసాగుతోంది.