ఆర్టికల్-370 రద్దుపై సుప్రీం కోర్టు ( Supreme Court) ఇచ్చిన తీర్పుపై ప్రధాని మోడీ (PM Modi) స్పందించారు. ఆర్టికల్ 370 విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రకమైనదిగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఈ తీర్పు జమ్ము కశ్మీర్, లడఖ్‌లోని సోదరీ సోదరీమణులకు ఆశ, పురోగతి, ఐక్యత కలిగించే ప్రకటన అని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు భారతీయులమైన మనం, అన్నిటికంటే ప్రియమైన, అధికంగా గౌరవించే ఐక్యత సారాంశాన్ని బలపరిచిందన్నారు.
ఆర్టికల్ 370 వల్ల ప్రగతి ఫలాలు జమ్ము కశ్మీర్ ప్రజలకు అందకుండా పోయాయన్నారు. అలా నష్టపోయిన బలహీన, అట్టడుగు వర్గాలకు ప్రయోజనాలు అందించేందుకు తమ ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తోందని తెలిపారు. ఈ రోజు తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు మాత్రమే కాదన్నారు. జమ్ము కశ్మీర్ ప్రజలకు ఇది ఒక ఆశాకిరణమని వెల్లడించారు.
ఇది ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు ఇచ్చిన గొప్ప వాగ్దానం అన్నారు. బలమైన, మరింత ఐక్యతతో కూడిన భారతదేశాన్ని నిర్మించాలనే తమ సమిష్టి సంకల్పానికి ఇది ఒక నిదర్శనమని చెప్పారు. ఇది నయా జమ్మూకాశ్మీర్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు అనేది అణగారిన వర్గాల హక్కులను పునరుద్ధరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
వేర్పాటువాదం, రాళ్లదాడులు సమసిపోయాయని ట్వీట్ చేశారు. జమ్ము కశ్మీర్ ప్రాంత మంతా ఇప్పుడు మధురమైన సంగీతం, సాంస్కృతిక వైభవంతో విరాజిల్లుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ తీర్పుతో దేశంలొ ఐక్యత మరోసారి కొనసాగిందన్నారు. సుప్రీం తీర్పును తమ పార్టీ స్వాగతిస్తోందని జేపీ నడ్డా అన్నారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు చాలా విచారకరంగా ఉందని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఈ తీర్పు అత్యంత దురదృష్టకరమన్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరని వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
ఈ తీర్పుతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామన్నారు. నీ నిరుత్సాహ పడబోమన్నారు. జమ్ముకశ్మీర్ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. జమ్మూకశ్మీర్ అనేక ఎత్తుపల్లాలను చూసిందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయడం మన ఓమి కాదన్నారు. దేశప్రజలు తీర్పును పండుగ జరుపుకొంటున్నారన్నారు. కానీ ఈరోజు జమ్ముకశ్మీర్ జైలుగా మారిందన్నారు.
ఇక సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్, శివసేనలు స్వాగతించాయి. జమ్ముకశ్మీర్‌లో వీలైనంత త్వరగా కేంద్రం ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కోరారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పూర్తిగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు తీర్పును శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే స్వాగతించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలిపి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్నారు.