రాబోయే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ (TDP) అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore)తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
విమానాశ్రయం నుంచి లోకేశ్‌తో కలిసి కారులో నేరుగా చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్ వెళ్లారు. గతంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి అద్భుతమైన విజయాన్ని ప్రశాంత్ కిషోర్ అందించారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం సర్వత్ర ఆసక్తి కలిగిస్తోంది. ఈ భేటీ నేపథ్యంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇటీవల నారా లోకేశ్ యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. రాష్ట్రంలో అన్ని పరిస్థితులను పరిశీలించిన తర్వాత పార్టీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ సన్నద్దతపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించే సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని టీడీపీ నిర్ణయించింది.
టీడీపీ తరఫున ఇప్పటి వరకు రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్‌తో పాటు రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఇది ఇలా వుంటే 2024లో వైసీపీ నష్టం కలిగించే అంశాలపై సీఎం జగన్ కు ఐప్యాక్ టీం ఒక నివేదిక ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీని పలు మార్లు ఐ ప్యాక్ టీం హెచ్చరించినా సీఎం జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబుతో పీకే భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.