తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)తో అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కే. కోటేశ్వర్ రావు (K.Koteshwar Rao),తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనం చిన్ని వెంకటేశ్వరరావులు ( Anamchinni Venkateswara Rao ) ఏకాంత చర్చలు జరిపారు.
ఈ సందర్బంగా జర్నలిస్టులకు ఉన్న సమస్యలను పరిష్కరించే మార్గాలతో పాటు, చిన్న , మధ్య తరగతి పత్రికల మనుగడ కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జర్నలిస్టుల గృహాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, మెమోలు సేకరించాలని 33 జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు.
ఇప్పటికే ఇచ్చిన స్థలాలు, స్వాధీనం చేయకుండా ఉన్న స్థలాలు, ఇకపై ఇచ్చేందుకు అనువైన స్థలాలను నిర్ధిష్టంగా పేర్కొంటూ నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఈ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి వాటి పరిష్కారం చూపుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు.