ఎన్నికలు దగ్గరపడేకొద్దీ కాంగ్రెస్ (Congress) లో చేరికలు మరింత ఊపందుకుంటున్నాయి. చిన్నాచితక లీడర్లు అంతా హస్తం గూటికి చేరుకున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఎవరు వచ్చినా వెల్ కమ్ అంటూ గాంధీ భవన్ (Gandhi Bhavan) తలుపులు తెరిచి పెట్టారు ఆపార్టీ నేతలు. తాజాగా ఖమ్మం (Khammam) లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti Srinivas Reddy) క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ (BRS) పార్టీ చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) పాల్గొన్నారు.
తుమ్మల మాట్లాడుతూ.. రఘునాథపాలెం మండలంలో మౌలిక వసతుల కల్పనలో గతంలో ఎమ్మెల్యేగా బీజం వేసానని.. అదే స్థాయిలో మరోసారి అభివృద్ధిని పరుగులు తీపిస్తానని అన్నారు. గత ప్రభుత్వాల్లో వచ్చిన అవకాశాన్ని జిల్లా అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు, ప్రతినిధులకు తానూ, పొంగులేటి అండగా ఉంటామని చెప్పారు. తమిద్దరి ఆధ్వర్యంలో రాజకీయ అవసరాలు తీర్చడానికి కృషి చేస్తామని అన్నారు తుమ్మల.
ఇక పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. కాళేశ్వరం గొప్ప గురించి కేసీఆర్ చెప్పారని.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎలా దెబ్బ తిన్నదో అందరికీ తెలియాలన్నారు. దీనికి కారకులు ఎవరని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా ఉపయోగపడిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజం అయ్యాయని తెలిపారు.
కాళేశ్వరంపై సీవీసీ చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు పొంగులేటి. కేసీఆర్ కు సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ లో చేరుతారని పేర్కొన్నారు. సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరించి గతంలో కాంగ్రెస్ సర్పంచులను బీఆర్ఎస్ లో చేర్పించారని గుర్తు చేశారు. ఇంత కాలం సర్పంచులు భయబ్రాంతులతో బతికారన్నారు. అర్ధరాత్రి కాదు పట్టపగలే ఇప్పుడు చేరుతున్నారని.. బందిపోట్లు ఎవ్వరూ అనేది పువ్వాడ అజయ్ కుమార్ చెప్పాలని సెటైర్లు వేశారు పొంగులేటి.