లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar). విజిలెన్స్ విచారణ జరుగుతుంటే బీఆర్ఎస్ (BRS) కు దడ మొదలైందని అన్నారు. కరీంనగర్ (Karimnagar) లో స్థానిక నేతలతో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్లారు మంత్రి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగా తాము వ్యవహరించడం లేదని.. కిషన్ రెడ్డి ముమ్మాటికీ కేసీఆర్ బినామీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పొన్నం. పదేళ్ల నుండి అధికారంలో ఉన్న బీజేపీ.. ఇంతకాలం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని.. తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విచారణకు ఆదేశించామంటేనే తమ చిత్తశుద్ది చేతల్లో చూపిస్తున్నామని గమనించాలన్నారు.
రాష్ట్రంలో జరిగిన భూ అక్రమాలపై కూడా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు పొన్నం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అక్రమాలన్నీ తెలుసని.. ఇసుక దందాలు కూడా జరిగాయని అన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నో చేశారని.. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వారికి న్యాయం జరిగేందుకు తాము చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్యారెంటీ స్కీమ్ లపై దరఖాస్తులు స్వీకరించామన్న ఆయన.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని వెల్లడించారు.
మరోవైపు, జెన్ కోలో అడ్డదారిలో ఉద్యోగం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ సరిత విషయంలో పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఆమెకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉద్యోగం ఇప్పించిన విషయంలో ఏ మాత్రం సంబంధం లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. జెన్ కో తో పాటు ఇతర ప్రభత్వ విభాగాల్లో అక్రమంగా ఉద్యోగం పొందినవారు వెంటనే వారంతా తమ ఉద్యోగాలు వదులుకోవాలని సూచించారు.