ప్రకాశం జిల్లా (Prakasam Dist) నాగులుప్పలపాడు మండలం, మద్దిరాలపాడు వద్ద 216 జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి (Three Dead) చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు అందించిన సమాచారం ప్రకారం…
కొరిశపాడు మండలం, పమిడిపాడుకు చెందిన ముగ్గురు యువకులు వినాయక విగ్రహం కొనేందుకు ఒంగోలు వెళ్లారు. అక్కడ పని పూర్తైయిన తర్వాత తిరిగి వస్తుండగా…మద్దిరాలపాడు జాతీయ రహదారిపై ఆగివున్న కంటైనర్ లారీని ఢీ కొట్టారు. వేగంగా వస్తున్న బైక్ బలంగా ఢీ కొట్టడంతో ముగ్గరు యువకుడు బైక్ పై నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. దాంతో అక్కడికక్కడే ముగ్గురు యువకులు మృతి చెందారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులు ప్రకాశం జిల్లా, కొరిశపాడు మండలం, పమిడిపాడుకు చెందిన వారుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పండుగ రోజుల్లో ప్రమాదం జరిగి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడంతో పమిడిపాడు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.