విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు(NTR) పేరున ముద్రించిన రూ.100 నాణెంని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (droupadi murmu) ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్ (rashtrapati bhavan) లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగు సినిమాకి ఎన్టీఆర్ చేసిన సేవల్ని స్మరించుకున్న రాష్ట్రపతి.. రాముడు, శ్రీకృష్ణుడు ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు.
సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎనలేని సేవలు అందించారని ద్రౌపది ముర్ము మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం చంద్రబాబు , బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఎన్టీఆర్ ఒక తరానికే కాకుండా.. తరతరాల వారికి హీరో అన్నారు పురంధేశ్వరి. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం కలిగించిందనీ.. ఆయన కూతురిగా ఇది తన అదృష్టం అన్నారు. ఎన్టీఆర్ జీవితం ఎందరికో ఆదర్శం అని తెలిపారు. ఎన్టీఆర్ జన్మించి… ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయన శత జయంతి వేడుకలను నందమూరి కుటుంబంతోపాటూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన 100 రూపాయల నాణేన్ని ఆయన గౌరవార్ధం సోమవారం విడుదల చేసింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తున్న ఈ నాణెం 100 శాతం లోహాలతో తయారు చేయడం విశేషం. 44 మిల్లీమీటర్ల ఈ నాణెంలో 50 శాతం సిల్వర్, 40 శాతం కాపర్ మిగతా 5, 5 శాతాల్లో నికెల్, జింక్ లోహాలతో ఉండి.. సరిగ్గా 100 శాతం లోహాలతో తయారయ్యేలా చేశారు.
ఎన్టీఆర్ నాణెం విషయానికి వస్తే.. ఓ వైపు 3 సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.
ఈ నాణేన్ని హైదరాబాదులోని మింట్ కాంపౌండ్లోనే ముద్రించారు. 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్ బొమ్మలను ఆయన కుటుంబ సభ్యులకే స్వయంగా సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించారని తెలిసింది.నందమూరి తారక రామారావు రూపంతో ఈ 100 రూపాయల నాణెం ముద్రించడం పట్ల నందమూరి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.