బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి ఎక్స్ పైర్ డేట్ (Expiredate) ముగిసిందని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి జోరుగా వీస్తోందని తెలిపారు. పదేండ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహంకారంతో విర్రవీగుతున్నాయని అని మండిపడ్డారు. ఆ ప్రభుత్వాల పాలనలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పూర్తిగా అవినీతి విచ్చల విడిగి పెరిగిపోయిందన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ… పదేండ్లుగా తెలంగాణ రాష్ట్రం ఒకే కుటుంబం చేతిలో బందీగా ఉంటుందోన్నారు. ప్రజల త్యాగాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అందుకే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో లేదో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో అన్ని వస్తువుల ధరలు పెరిగాయన్నారు. జీఎస్టీ, పెట్రోల్ ధరల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. నిత్యావసరాల ధరలు తగ్గాలంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకు ధాన్యంపై క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామన్నారు.
పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో కుంభకోణాలు జరిగాయన్నారు. పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురైందన్నారు. కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయన్నారు.
గృహిణికి ఎన్నో కష్టాలు ఉంటాయన్నారు. పిల్లలకు స్కూల్ ఫీజులు, అనారోగ్య సమస్యలు వంటి చాలా సమస్యలుంటాయన్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళల కష్టాలు తొలగిస్తామన్నారు. ప్రతి నెల మహిళ ఖాతాలో రూ.2500 జమచేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ ను రూ.500కే అందజేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.