కాంగ్రెస్ (Congress) నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)షాక్ ఇచ్చింది. హర్యానాలో భూమి కొనుగోలుకు సంబంధించి మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్‌లో ప్రియాంక పేరును ఈడీ చేర్చింది. ఆమెతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరును కూడా ఛార్జిషీట్‌లో జత చేసింది.
ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో ప్రియాంక భూమిని కొనుగోలు చేశారంటూ ఈడీ అభియోగాలు చేసింది. వారితో పాటు ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ థంపి, భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సుమీత్ చంద్రలపై ఛార్జిషీట్ నమోదు చేసింది. పరారీలో ఉన్న ఆయుధాల డీలర్ సంజయ్ బండారీకి ఆ ఇద్దరు నిందితులు సహాయం చేశారని ఈడీ అనుమానిస్తోంది.
2006లో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా ద్వారా ఫరీదాబాద్ లోని అమీన్ పూర్ ప్రాంతంలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత నాలుగేండ్లకు మళ్లీ అదే భూమిని తిరిగి పహ్వాకు విక్రయించారు. అదే 2006లో ప్రియాంక గాంధీ పేరిట అమీన్ పూర్ లో ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ ఇంటిని మళ్లీ పహ్వాకు అమ్మారు.
ఈ భూముల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ విదేశాల నుంచి అక్రమంగా జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. విదేశాలకు చెందిన థంపి, సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు భూముల కొనుగోలు కారణంగా చూపి మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రియాంక గాంధీ పేరును ఛార్జిషీట్ లో చేర్చింది.