ఎన్నికల వేళ రాజస్థాన్‌లో ఈడీ (ED) దూకుడు పెంచింది. జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఓ ఐఏఎస్ అధికారి నివాసంలో ఈడీ దాడులు చేస్తోంది. పీహెచ్‌ఈ శాఖకు చెందిన అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుబోధ్ అగర్వాల్ నివాసంలో ఈ రోజు ఉదయం నుంచి ఈడీ తనిఖీలు చేస్తోంది.
రాజధాని జైపూర్, దౌసాతో సహా మొత్తం 25 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. జల్ జీవన్ మిషన్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు జరిపింది. ఈ మేరకు ఈ కసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది.
జల్ శక్తి మిషన్ కింద టెండర్లు, బిల్లుల మంజూరు కోసం పలువురు అధికారులకు శ్రీ శ్యామ్ ట్యూబ్ వెల్ కంపెనీ ప్రొప్రైటర్ మహేశ్ మిట్టల్, శ్రీ గణపతి ట్యూబ్ వెల్ కంపెనీ ప్రొప్రైటర్, ఇతరులు కలిసి లంచాలు ఇచ్చారంటూ ఎఫ్ఐఆర్‌లో ఏసీబీ అభియోగాలు చేసింది. ఈ క్రమంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
జల్ శక్తి మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నల్లాల ద్వారా సురక్షితమైన నీటిని అందిస్తున్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో పీహెచ్ఈడీ శాఖ అమలు చేస్తోంది. ఈ దాడులపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
విపక్ష నేతలను భయ బ్రాంతులకు గురి చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఈ దాడులను పాకిస్తాన్ నుంచి వచ్చిన మిడతల దండు దాడితో పోల్చారు. కేంద్రం బెదిరింపులకు తాము భయపడబోమని గెహ్లాట్ స్పష్టం చేశారు.