– 19న విపక్ష కూటమి భేటీకి ప్లాన్స్
– కీలక నేతల హాజరుపై సస్పెన్స్
– ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో అలక
– కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసహనం
– కూటమి కట్టుబాట్లు మరిచారని విమర్శలు
– ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు
– 19న మీటింగ్ జరిగితే హాజరయ్యే పార్టీలెన్ని?
మోడీ (Modi) సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయన్స్ (INDIA) గా ఏర్పడ్డాయి. 2024లో ఎన్డీఏ సర్కార్ ను కూల్చేందుకు కాంగ్రెస్ (Congress) తోపాటు 26 పార్టీలు ఏకమయ్యాయి. మూడుసార్లు భేటీ అయి పార్లమెంట్ ఎన్నికలకు ఎలా ముందుకెళ్దాం అని చర్చలు జరిపాయి. అయితే.. ఈమధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచి కథ అడ్డం తిరిగింది. కూటమిలో కలహాలు ఎక్కువయ్యాయి. బహిరంగంగానే నేతలు కాంగ్రెస్ తీరును తప్పుబడుతున్నారు. నాలుగో మీటింగ్ ఏర్పాటు వాయిదా పడుతూ వచ్చి ఈనెల 19న జరపాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అయితే.. కూటమిలోని సభ్యులు వస్తారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఢిల్లీ వేదికగా 19న కూటమి నాలుగో సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షత వహించనుంది. ముందుగా ఈ సమావేశాన్ని గత బుధవారం (ఈనెల 6న) నిర్వహించాలని భావించారు. కానీ, కీలక నేతలైన సీఎం మమతా బెనర్జీ, సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కుదరదని తెగేసి చెప్పారు. ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ నేపథ్యంలో రాలేమన్నారు. దీంతో ఆ భేటీని రద్దు చేశారు. తాజా సమాచారం ప్రకారం.. 19న ఇండియా కూటమి సమావేశం జరగనుంది. రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకం ప్రధాన ఎజెండాగా ఈ భేటీ ఉండబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నేతలు వస్తారా? లేదా? అనే అంశం ఆధారంగా ఈ భేటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ రికార్డ్ స్థాయి విజయాలను నమోదు చేసింది. కాంగ్రెస్ ఏకంగా అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ తో ఇతర పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టుబాట్లను కాలరాశారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడ వదలాలని కొందరు నేతలు మీడియా ముందే బాహాటంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి చక్కగా ముందుకు సాగడం కష్టమనే ప్రచారం జరుగుతోంది.
ఇంకో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ కీలక సమయంలో కూటమి మధ్య సీట్ల పంచాయితీలు తెగకపోతే మొదటికే మోసం వస్తుంది. అనుకున్న లక్ష్యం నెరవేరక పోగా.. ఘోర అవమానం తప్పదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన తీరు మార్చుకుని ముందుకు సాగితే కూటమి మనుగడ ఉంటుందని.. లేకపోతే కొన్ని పార్టీలు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంటుందని.. దాని ఫలితం ఎన్డీఏకు ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు.