విపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA Alliance) ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీకి పోటీగా ఏ వ్యక్తినీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్టు చేయాలని తాము అనుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు.
మొదట ఎన్నికల్లో విజయం సాధించడం మంచిదని, ఆ తర్వాత ఇండియా కూటమిలోని పార్టీలన్నీ సమావేశమై తమ ప్రధాని ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ఐక్యంగా పోరాటం చేసేలా ఉపయోగపడుతుందని వెల్లడించారు.
విపక్ష కూటమిలోని పార్టీలతో తాము ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముఖ్యమని, అందుకే ఇండియా కూటమి సమావేశాలకు దూరంగా ఉంటున్నామని మిత్రపక్షాలకు చెబుతున్నామన్నారు. బీజేపీతో పోరాడాలంటే పొత్తు పెట్టుకుని జట్టుగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఖర్గే అన్నారు.
ఆప్‌తో పొత్తులను తమ పార్టీ రాష్ట్ర విభాగాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కేరళలో వామపక్షాలు కాంగ్రెస్‌కు బద్దశత్రువులుగా వున్నప్పటికీ జాతీయ స్థాయిలో పొత్తులు పెట్టుకుంటున్నాయని, అదే తరహాలో ఆప్ కూడా పొత్తుల విషయాన్ని పరిగణించవచ్చన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలను ఐక్యంగా ఉంచి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.