పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharghe) పేరును ప్రతిపాదించినట్టు తెలిపారు. తనతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఖర్గే పేరును ప్రతిపాదించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటారని అంతా తమను అడుగుతున్నారని చెప్పారు. అందుకే తాము ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును సూచించామన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు.
తమ అభ్యర్థిగా ఖర్గే పేరును సూచించడంపై అంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ నిర్ణయం పట్ల ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా దీనిపై మాట్లాడారు. ఖర్గే ఒక గొప్ప నాయకుడని కొనియాడారు. రాజ్యసభలో ఖర్గేతో కలిసి పనిచేయడం తన అదృష్టమని వెల్లడించారు.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పీఎం అభ్యర్థిగా పోటీ చేసే విషయంలో ఖర్గే ఆసక్తిగా లేరని తెలుస్తోంది. తాను ఒక ఫైటర్ అంటూ ఖర్గే చెబుతున్నట్టు సమాచారం. తాను అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిగానో లేదా దళితున్ని అని చెప్పుకుని రాజకీయాలు చేయలేదని అన్నారని తెలుస్తోంది. జీవితం మొత్తం సమానత్వం కోసం పోరాడినట్లు ఇండియా కూటమి సభ్యులతో ఖర్గే అన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.