గత బీఆర్ఎస్ సర్కారులో మంత్రి చేసిన కొప్పుల ఈశ్వర్(Ex Minister koppula Eshwar)కు చేదు అనుభవం ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రికి నిరసన సెగ తగిలింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలోని వన్ ఇంక్లైన్ బొగ్గు గనిలో బుధవారం కొప్పుల ఎన్నికల ప్రచారం చేసేందుకు వెళ్లారు.
ఆయన వెంట బీఆర్ఎస్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారు. అయితే, మాజీ మంత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో అక్కడే బొగ్గు గనిలో పనిచేస్తున్న మహిళ కార్మికులు ఆయన్ను అడ్డగించారు.
గతంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తమ బంధువులకు గనిలో ఉద్యోగాలు పెట్టించారని సమాచారం. వారిని గనిలోపలికి పంపించకుండా కేవలం పైపైన పనులు చెబుతున్నారని, తమను గనిలోపల పనిచేయిస్తున్నారని,ఇదేం న్యాయం అని మహిళా కార్మికులు కొప్పులను నిలదీశారు.తమను ఏరియా వర్క్‌షాప్ నుంచి ఎందుకు బదిలీ చేశారంటూ ప్రశ్నించారు.
ఏసీ రూములో కూర్చున్న నాయకులకు మా సమస్యలు ఎలా తెలుస్తాయంటూ కొప్పుల ఈశ్వర్‌ను మహిళ కార్మికులు ప్రశ్నించారు. అయితే, ఈ తతంగాన్ని ఓ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వీడియో తీయగా..స్థానిక మాజీ ఎమ్మెల్యే చందర్ అతని ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైన ఆ పార్టీ నేతలు చేసిన పనుల పట్ల జనాలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారని పలువురు విమర్శిస్తున్నారు.