బీఆర్ఎస్ (BRS) నేత బాల్క సుమన్ (Balka Suman) వ్యాఖ్యలపై దుమారం రేగింది. బాల్క సుమన్ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడని ఆరోపిస్తూ ఓయూలో కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ తన బానిస కుక్కలతో కాంగ్రెస్ నేతలపై మొరిగిస్తే ఓయూ విద్యార్థులు తగిన గుణపాఠం చెబుతారని టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు కోట శ్రీనివాస్ హెచ్చరించారు.
రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఇష్టారీతిన మాట్లాడారని మండిపడ్డారు. కేటీఆర్‌కు బాల్క సుమన్ బానిస అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్చను పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ తో కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు మణుగూరు మండలంలో అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డిపై కారు కూతలు కూస్తే కారం పోసి కొడతామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఒక నాయకుడై ఉండి రాష్ట్ర ముఖ్య మంత్రిపై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేయడం బాల్క సుమన్‌కు తగదన్నారు. మాటలు మర్యాదగా రానివ్వాలని.. లేదంటే ఒళ్ళు పగలడం కాయమని తీవ్ర హెచ్చరికలు చేశారు.
అటు మంచిర్యాల జిల్లా జన్నారంలో సుమన్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్దం చేశారు. ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపెల్లి చౌరస్తా వరకు సుమన్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. బాల్క సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మందమర్రి, లక్సెట్టిపేట, హాజీపూర్‌లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇటు హైదరాబాద్‌లోనూ నిరసనలు వెల్లువెత్తాయి.
సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వ్యాఖ్యలను సికింద్ర బాద్ యూత్ కాంగ్రెస్ నేతలు ఖండించారు. వెంటనే రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తార్నాకలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్దం చేసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమన్ ను అరెస్టు చేయాలని మీర్ పేట్ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అటు జక్రాన్ పల్లిలోనూ బాల్క సుమన్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.