Telugu News » Telangana : ప్రజావాణికి పోటెత్తిన జనం.. ఎవరిని పలకరించినా కన్నీళ్లే…!

Telangana : ప్రజావాణికి పోటెత్తిన జనం.. ఎవరిని పలకరించినా కన్నీళ్లే…!

భూకబ్జాలతో తాము విలువైన భూములు కోల్పోయామని మరికొందరు కన్నీళ్లు పెడుతున్నారు. భూముల ఆశ జూపి తమ వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి బీఆర్ఎస్ నేతలు తమను నట్టేటా ముంచారని మరికొందరు శాపనార్ధాలు పెడుతున్నారు.

by Ramu
Public Expressed their anguish in praja vaani

– ఒకరిది ధరణి సమస్య
– మరొకరిది డబుల్ బెడ్రూం బాధ
– ఇంకొకరిది ల్యాండ్ లడాయి
– పెన్షన్ రానివాళ్లు, నిరుద్యోగులు..
– అందరి దారి ప్రజా భవన్
– ప్రజా వాణికి పోటెత్తుతున్న దరఖాస్తులు
– ‘మన తొలివెలుగు’ ముందు వాపోయిన ప్రజలు
– కేసీఆర్ పాలనలో పడ్డ కష్టాల ఏకరువు
– కొత్త సర్కార్ ఆదుకోవాలని వినతులు

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజా వాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ప్రజల నుంచి అనేక వినతులు వస్తున్నాయి. రోజురోజుకీ ప్రజా భవన్ దగ్గర క్యూ లైన్ పెరుగుతోంది. తొమ్మిదిన్నరేళ్లపాటు ఎదురైన సమస్యలను కొత్త ప్రభుత్వం ముందు ఏకరువు పెట్టేందుకు జనం తరలి వస్తున్నారు.

Public Expressed their anguish in praja vaani

దీంతో ప్రభుత్వం జిల్లాల్లోనే ప్రజా వాణి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. అయితే.. శుక్రవారం ప్రజా వాణి (ప్రజా దర్బార్) కి జనం పోటెత్తారు. కిలోమీటర్ల మేర క్యూలైన్ కనిపించింది. వారిని ‘మన తొలివెలుగు’ పలకరించగా.. కన్నీళ్లు పెట్టుకుంటూ తమ బాధను చెప్పుకున్నారు. ధరణి వల్ల దగా పడ్డామని కొంతమంది, భూకబ్జాలతో విలువైన భూములు కోల్పోయామని మరికొందరు వాపోయారు. భూముల ఆశ జూపి తమ వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి బీఆర్ఎస్ నేతలు.. తమను నట్టేట ముంచారని ఇంకొందరు మండిపడ్డారు.

గత ప్రభుత్వ విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. పాలకుల తప్పిదాల వల్ల తాము శిక్ష అనుభవిస్తున్నామని వాపోయారు. కనీసం ఈ ప్రభుత్వమైనా తమ గోడు విని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుకున్నారు. అందుకే, దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజా వాణికి వచ్చామని తెలిపారు బాధితులు. వరంగల్ కు చెందిన బాధితుడు మాట్లాడుతూ.. గుండా ప్రకాశ్ రావు, మాదారపు రాజేశ్వర్ రావు అనే వ్యక్తులు తమకు 37 ఎకరాల భూమిని ఇప్పిస్తామని చెప్పి కోట్లు వసూలు చేశారని తెలిపాడు.

ఆ భూమిని సొసైటీ పేరిట చేసి వాళ్ల దగ్గరే ఉంచుకున్నారని అన్నాడు. వారిపై చర్యల కోసం ఫిర్యాదు చేసేందుకు వచ్చానని తెలిపాడు. ధరణిలో రెవెన్యూ సిబ్బంది తప్పిదం వల్ల ఐదేండ్లుగా ఇబ్బంది పడుతున్నానని చేవేళ్ల మండలానికి చెందిన బాధితుడు చెప్పాడు. ధరణి వల్ల తన ఎకరా భూమిని కోల్పోయానని.. అందుకే, ఫిర్యాదు చేసేందుకు వచ్చానని వెల్లడించాడు. తనకు డబుల్ బెడ్ రూం వచ్చిందని, లిస్టులో పేరు కూడా ఉందని జమ్మిగడ్డ, నెహ్రూ నగర్ బాధితురాలు తెలిపారు. నెంబర్ వచ్చాక కలెక్టర్ కార్యాలయానికి వెళితే కీసరకు వెళ్లమన్నారని చెప్పారు. అక్కడికి వెళితే మరో కార్యాలయానికి వెళ్లాలని తిప్పించారని వాపోయారు.

తన భర్తకు పింఛన్ రాలేదని.. సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని తాము ఇక్కడకు వచ్చామని.. కానీ, ఆయన లేరని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ హమాలీల రేట్లు తగ్గించిందని టీఎస్ ఆర్టీసీకి చెందిన మారుతి అన్నాడు. దీని వల్ల 2వేల కుటుంబాల్లో చీకటి నెలకొందని.. దీనిపై ఫిర్యాదు చేస్తే అక్నాలెడ్జ్ మెంట్ ఇవ్వలేదని తెలిపాడు. 20 ఏండ్లుగా ఉంటున్నా కూడా తమకు పోడు పట్టాలు ఇవ్వలేదని అశ్వారావుపేట బాధితులు తెలిపారు. అలాగే, ఇళ్ల పట్టాలు ఇప్పిస్తారని ఇక్కడకు వచ్చామన్నారు.

గత ప్రభుత్వంలో తాను మెయిన్స్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యానని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిందని గురుకుల ప్రిన్సిపల్ ఆశావహుడు తెలిపాడు. కానీ, తనను రిజెక్టెడ్ లిస్టులో పెట్టారని చెప్పాడు. కానీ, రిజెక్టెడ్ లిస్టులో ఉన్న వాళ్లకు కూడా తర్వాత డబ్బులిస్తే పోస్టింగులు ఇచ్చారన్నాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చానని తెలిపాడు. తన పట్టా భూమిని ప్రభుత్వ భూమి కింద చూపిస్తున్నారని మద్దూరుకు చెందిన బాధితుడు వాపోయాడు. తనకు పట్టా పాసు బుక్ ఉందని, రైతు బంధు పడుతోందని దశరథ్ అనే రైతు తెలిపాడు.

కానీ పహణిలో మాత్రం ప్రభుత్వ భూమిగా చూపిస్తోందని చెప్పాడు. గృహ లక్ష్మీ పథకం కింద ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకునేందుకు పది మంది వచ్చామని కొమురవెల్లి నుంచి వచ్చిన వారు తెలిపారు. తాను ఒక దొర దగ్గర భూమి కొన్నానని హన్మకొండకు చెందిన బాధితుడు చెబుతూ.. నాలుగేండ్లు అయినా తనను భూమి దగ్గరకు రానివ్వడం లేదని వాపోయాడు. ఇలా ఇంకా ఎందరో ఏదో ఒక సమస్యతో ప్రజా వాణికి వచ్చారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో పడిన కష్టాలను ‘మన తొలివెలుగు’ కు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

You may also like

Leave a Comment