ఉక్రెయిన్ (Ukraine)తో చర్చలకు రష్యా సుముఖత వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌తో చర్చలకు రష్యా ఆసక్తిగా ఉందనే విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా గుర్తించాలని అన్నారు. తాజాగా చర్చలకు వచ్చేలాగా ఉక్రెయిన్ను ఒప్పించాలని అగ్రరాజ్యం అమెరికాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin) కోరారు.
ఓ ఆంగ్ల న్యూస్ ఛానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ద ఖైదీల అప్పగింతకు తాము రెడీగా ఉన్నట్టు చెప్పారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గ్రెషక్కోవిచ్‌ను అప్పగింతకు సంబంధించిన విషయంలోనూ తాము రెడీగా ఉన్నామని చెప్పారు.
గూఢచర్యం ఆరోపణలపై గత మార్చిలో ఇవాన్ గ్రెషక్కోవిచ్‌ను రష్యా నిర్బంధించింది. ఇవాన్ ను వదిలేయాలంటే జర్మనీలో ఉన్న తమ ఏజెంట్‌ను విడిపించాలని పుతిన్ అమెరికాను కోరారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దం మొదలై రెండేండ్లు గడుస్తోంది.
ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్ పౌరులను కాపాడుకునేందుకు తాము యుద్ధం చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వం పొందకుండా ఉండేందుకు కూడా ఆ యుద్ధం అత్యంత అవసరమని పుతిన్ పేర్కొన్నారు. తమతో చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని ఆరోపించారు., ఆయన్ను చర్చలకు వచ్చేలా అమెరికా చర్యలు తీసుకోవాలని కోరారు.