మహిళా బిల్లులో బీసీ మహిళలకు (BC Women) సబ్ కోటా కల్పించాలని, అప్పుడే సమాజంలో సామాజిక న్యాయం లభిస్తుందని, లేకపోతే ఏ మార్పూ ఉండబోదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య (R Krishnayya) డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో ఎస్సీ, ఎస్టీ, బీసీల సబ్ కోటా చేర్చాలని, లేదంటే ఆ బిల్లుకు సార్థకత ఉండదని అన్నారు. రాజకీయాల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లను (Reservations) ప్రవేశపెట్టాలని కోరారు.
దేశంలో 56 శాతం జనాభా గల బీసీ కులాల బతుకుల గురించి పట్టించుకోరా? అని కేంద్రాన్ని నిలదీశారు. బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్లమెంట్‌ను దిగ్భంధిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. అనంతరం చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు, కులగణనతోపాటు అంశాలపై తీర్మానాలు చేశారు.
54 శాతం జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు లేనందున ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశంలో 2,600 బీసీ కులాలుండగా, 75 ఏండ్లలో చట్టసభల్లోకి కేవలం 50 బీసీ కులాలు మాత్రమే ప్రవేశించాయని తెలిపారు. పార్లమెంటు సభ్యుల్లో బీసీల వాటా కేవలం 15 శాతం మాత్రమేనని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని 121 సార్లు సవరించినా బీసీల సంక్షేమానికి సంబంధించి ఒక్క సవరణ కూడా చేయలేదని పేర్కొన్నారు.
అన్ని కులాలకూ సమ ప్రాతినిధ్యం లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం కాజాలదని కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు క్యాబినెట్లలో బీసీలకు అప్రధాన శాఖలు కేటాయించి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాయని, దీనివల్ల బీసీ వర్గాల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు.