– సాహితీ లక్ష్మీ నారాయణ లీలలెన్నో
– ప్రజల సొమ్ము దోచేసి సైలెంట్ గా వ్యవహారాలు
– ఫినిక్స్ సహా ఇతర పెద్దల్ని కాపాడేందుకు కుట్రలు
– అంతా మార్కెటింగ్ వాళ్లపై తోసేసే కుయుక్తులు
– బ్యాంక్ అకౌంట్ల లావాదేవీల్లో అసలు నిజాలు
– ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం
– ఇకపై సాహితీ స్కాములపై వరుస కథనాలు
వేల మందిని ముంచేసి వేల కోట్లు వెనకేసుకున్నాడు సాహితీ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ (sahithi infrastructures) ఓనర్ బూదాటి లక్ష్మీ నారాయణ (budati Lakshmi Narayana). ఈ వ్యవహారంపై ఈడీ (ED) దర్యాప్తు జరుగుతోంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు నాయకుల నుంచి అధికారుల దాకా అందర్నీ ఇన్వాల్వ్ చేసి భారీగా దోపిడీ చేశాడు బూదాటి. ఇందులో వందల కోట్లలో దుబారా ఖర్చే అధికంగా ఉంది. పెళ్లిళ్లు, పేరంటాలు, పబ్స్, పార్టీలతోపాటు నాయకులకు ఇచ్చిన కమీషన్స్ అధికంగా ఉన్నాయి. ఈ లెక్కలన్నీ ఈడీ దృష్టికి వెళ్లినా.. అన్నుకున్న దిశగా అడుగులు పడడం లేదని అంటున్నారు బాధితులు. పైగా, తప్పంతా మార్కెటింగ్ వాళ్లదే అన్నట్టుగా కుట్రలు జరుగుతున్నాయని.. ఏ కంపెనీ అయినా సరే డబ్బులు ఓనర్లకే దక్కుతున్నాయనే విషయం అందరికీ తెలుసని చెబుతున్నారు.
లక్ష్మీ నారాయణ మైండ్ గేమ్
ఎంతో మందిని మోసం చేసినా.. వేల కోట్ల దందాకు పాల్పడినా.. అరెస్ట్ అయి బెయిల్ పై బయటకొచ్చాడు బూదాటి. కానీ, బాధితులకు న్యాయం జరిగిందా? అంటే ఇప్పటికీ లేదు. బెయిలబుల్ కేసులు 5 ఉన్నా 90 రోజుల జైలు జీవితాన్ని 365 రోజులకు పొడిగించేలా ప్రివెంటివ్ డిటెన్ష్ యాక్ట్ 1950ని ఉపయోగిస్తారు. అయితే.. రాజకీయ పలుకుబడి ఉన్న ఆర్థిక నేరగాళ్లకు మాత్రం ఇది వర్తింప చేయడం లేదు. దీనికి చక్కటి ఉదాహరణే బూదాటి. 30కి పైగా కేసులు, వేల కోట్ల రూపాయల మోసం చేసినా.. బయటకొచ్చి తన మైండ్ గేమ్ తో ఇష్యూని డైవర్ట్ చేస్తున్నాడని బాధితులు చెబుతున్నారు.
ఈడీకి ఇవి కనిపించడం లేదా?
సాహితీ వ్యవహారంలో దర్యాప్తు సరిగ్గా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అసలు వాళ్లను వదిలేసినట్టుగా కనిపిస్తోంది. కోట్ల రూపాయలు ఇంట్రస్ట్ తీసుకున్న కేడియా, సునీల్ అహూజాలపై చర్యలు తీసుకున్నది లేదు. దాదాపు 13 వందల కోట్ల రూపాయల బ్యాంకు స్టేట్ మెంట్లలో ఎన్నో లింకులు ఉన్నా వాటిపై దృష్టి సారించడం లేదు. కంపెనీకి సంబంధించిన డబ్బులు బూదాటి భార్య, కూతురు, కుమారుడి పర్సనల్ అకౌంట్లకి వందల కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అమీన్ పూర్ పర్మిషన్స్ అంటోనీ రెడ్డి ద్వారా కవితకు 20 కోట్లు ముట్టిన లెక్కను టచ్ చేయడం లేదు. అలాగే, ప్రహ్లాద్, కొడాలి శ్రీనివాసరావు, గాంధీ పాత్రలపైనా చర్యలు లేవు. గ్రీన్ మెట్రో అశోక్ కు 15 కోట్లు, శ్రీనిధి శ్రీహరికి 15 కోట్లు, షిబా ఇన్ఫ్రా టెక్ కి 8 కోట్లు, తన కూతురుకి 2 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఇవన్నీ ఈడీకి కనిపించడం లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఫినిక్స్ పేరు మీద ఒక్క ఎకరా లేకుండానే డబ్బులు చేతులు మారాయి. ఫినిక్స్ కంపెనీకి 80 కోట్లు వైట్ లో ట్రాన్స్ ఫర్ చేసి కేవలం 15 కోట్లకే కొన్నట్టు చూపాడు. 65 కోట్లు ఏమయ్యాయనేది ఇప్పటికీ తేలలేదు. ఫినిక్స్ ఇతర పెద్దలను కాపాడేందుకు బూదాటి కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మార్కెటింగ్ వాళ్లు ఎత్తుకుపోయారన్న రూ.112 కోట్ల లెక్క
బ్యాంక్ అకౌంట్లలో క్లియర్ గా ఉన్నా..!
ల్యాండ్ అడ్వాన్సుల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడు లక్ష్మీ నారాయణ. కానీ, సొంతానికి చాలా వాడేసుకున్నాడు. ఆయన బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే ఇవన్నీ ఉంటాయి. కానీ, ఈడీ ఆ దిశగా పూర్తిస్థాయిలో అడుగులు వేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కేసును పక్కదోవ పట్టించడానికి బూదాటి మార్కెటింగ్ వాళ్లను బూచీగా చూపించడమే. పూర్ణచంద్రరావు లాంటి వాళ్లపై అంతా తోసేసి.. ఉన్న పలుకుబడితో తన మాస్టర్ మైండ్ గేమ్ తో అంతా నడిపిస్తున్నాడు లక్ష్మీ నారాయణ. నిజానికి కంపెనీలోని లాభాలన్నీ ఆయన కుటుంబసభ్యులకే అందాయి. అలాంటప్పుడు మార్కెటింగ్ వాళ్లదే తప్పనేలా చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అమీన్ పూర్ లో 430 కోట్ల బిజినెస్ జరిగింది. ఆ లెక్కలు ఉన్నప్పటికీ డబ్బులు మిస్ అయినట్టు కట్టు కథ అల్లి.. డబ్బులు పోయాయని చెప్పి.. తప్పుడు ప్రచారం చేసి ఆ మొత్తం వివిధ బ్యాంకు అకౌంట్లలో 112 కోట్ల దాకా డిపాజిట్ చేశారు. ఏ బ్యాంకులో ఎంత వేశారు అనే లెక్కలన్నీ ఉన్నాయి. కానీ, కేసును డైవర్ట్ చేసే కుట్ర జరుగుతోంది. రాజకీయ పెద్దల సహకారంతో తప్పించుకుంటున్నాడు లక్ష్మీ నారాయణ.
లక్ష్మీనారాయణ దిగమింగిన రూ.67కోట్ల లెక్క
టీటీడీ బోర్డు మెంబర్ అంశంలోనూ అంతే!
అమీన్ పూర్ వ్యవహారంతో బూదాటి లీలలన్నీ బయటకు రావడంతో అప్పటికి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న ఈయన ఆ పదవికి సైతం రాజీనామా చేయాల్సి వచ్చింది. నిజానికి ఈ పదవి కోసం 20 కోట్ల దాకా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. 2021 సెప్టెంబర్ లో టీటీడీ సభ్యుడిగా లక్ష్మీ నారాయణ ప్రమాణ స్వీకారం చేశాడు. విశాఖ శారదా పీఠాధిపతికి ఈయన భక్తుడు. అయితే.. టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న సమయంలో పరిచయమైన రాజకీయ లింక్స్ ద్వారా.. ఇప్పుడు అమాయకులైన మార్కెటింగ్ వాళ్లను బలి చేస్తూ పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.
అప్పుడు సహారా, అగ్రిగోల్డ్.. ఇప్పుడు సాహితీ!
ప్రజలకు ఆకర్షణీయ స్కీములను ఆశగా చూపించి కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న కంపెనీలెన్నో ఉన్నాయి. గతంలో సహారా, అగ్రిగోల్డ్ సంస్థలు ఇలాగే వ్యవహరించి కోట్ల రూపాయలు దండుకున్నాయి. డబ్బంతా ఓనర్లు తినేయడంతో చివరకు మధ్యలో ఉన్న మార్కెటింగ్ వాళ్లు బలయ్యారు. కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. భవన నిర్మాణం నుంచి ఆర్థిక సేవలు, పట్టణాభివృద్ధి, మ్యూచువల్ ఫండ్స్, జీవిత బీమా వంటి రంగాలలోకి సహారా విస్తరించింది. కానీ, పెట్టుబడిదారుల డబ్బు పక్కదారి పట్టింది. అలాగే, 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్ పై అభియోగాలు దాఖలయ్యాయి. అయితే.. సహారా, అగ్రి గోల్డ్ ఇష్యూల్లో ఓనర్లే లాభపడుతున్నారు. ఇప్పుడు సాహితీ విషయంలోనూ అంతే. కానీ, అంతా మార్కెటింగ్ వాళ్లపై తోసేసే కుట్రలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు.
సాహితీ స్కాములపై ‘రాష్ట్ర’ వరుస కథనాలు
సాహితీ కంపెనీ ఎన్నో ప్రాజెక్టులు చేసింది. వాటిపై ఎంతో లాభపడింది. ఆ వివరాలన్నీ ఆధారాలతో సహా ‘రాష్ట్ర’ వరుస కథనాల్లో ఇవ్వనుంది. తర్వాతి కథనంలో ప్రాజెక్టుల విషయాలు, జరిగిన అవకతవకలను వివరించనుంది.