ప్రజావాణి (Prajavani) కార్యక్రమం ద్వారా తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లిన ఓ మహిళకు ఉద్యోగం లభించింది. విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. రాచకొండ కమిషనరేట్‌లో ఆ మహిళకు ఉద్యోగం రాగా తాజాగా ఆమెకు సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) అపాయింట్ మెంట్ లెటర్ అందజేశారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అంబర్ పేట్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సొంగా శేఖర్ కానిస్టేబుల్ గా పని చేసేవారు. 2021 సెప్టెంబర్ 30న విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ విషయాన్ని ఆయన భార్య సత్యలత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లారు. తమకు సహాయం చేయాలి ప్రభుత్వాన్ని కోరారు.
ఆమె ఏపీకి చెందిన మహిళ కావడంతో స్థానికత నిబంధన అడ్డు వచ్చింది. దీంతో ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరాకరించింది. చూస్తుండగానే రెండేండ్లు గడిచి పోయింది. ఇటీవల రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
తన కుటుుంబ పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి ఆమె వివరించారు. దీంతో మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించాలని, ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ర్ట డీజీపీ, రాచకొండ సీపీలను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆమెకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇవ్వాలని రాచకొండ సీపీకి డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఆమెకు సీపీ అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారు.