ప్రధాని మోడీ (PM Modi ) పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోడీ హాజరు కావడం వల్లే భారత జట్టు ఓడి పోయిందని విమర్శలు చేశారు. పీఎం అంటే పనౌతి (చెడు శకునం) మోడీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును అదానీ కాజేస్తుంటే దాని నుంచి ప్రజల దృష్టిని ప్రధాని మోడీ మరలుస్తున్నారంటూ ఆరోపించారు.
రాజస్థాన్‌లోని బాడ్మేర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ప్రధాని మోడీ ఒక చెడు శకునమని విమర్శలు గుప్పించారు. ఆయన హాజరు కావడం వల్లే ఓడిపోయామంటూ ఎద్దేవా చేశారు. ప్రజల జేబులను కొల్ల గొట్టడమే అదానీ పని అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ప్రధాని గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ ఉపయోగించిన పదాలు చాలా అవమానకరంగా ఉన్నాయని తీవ్ర స్థాయిలో మండిపడింది. వెంటనే ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
గౌరవమైన ప్రధాని పదవిలో ఉన్న మోడీపై ఇలాంటి పదాలా..? అంటూ తీవ్రంగా విరుచుకు పడింది. మన ప్రధానిని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయని తెలిపింది. మరి రాహుల్‌గాంధీకి ఏమైంది…? అని ప్రశ్నించింది. ఆయన తల్లి గుజరాత్‌లో మౌత్ కా సౌదాఘర్ అని గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ సారైనా రాహుల్ క్షమాపణ చెప్తారని ఆశిస్తున్నామన్నారు. కానీ ఆయన చెప్పరు కదా…? అని తెలిపారు. గతంలో సుప్రీం కోర్టులో కూడా క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారన్నారు. దేశప్రజలు రాహుల్ గాంధీకి గట్టి సమాధానం చెబుతారని పేర్కొన్నారు.