బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ఫోన్ కాల్ చేశారు. ఇటీవల ఇండియా కూటమి సమావేశంలో విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రకటించడంతో నితీశ్ కుమార్ అలక వహించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ను బుజ్జగించేందుకు ఆయనకు రాహుల్ గాంధీ కాల్ చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
జనతాదళ్ (యునైటెడ్) వర్గాల సమాచారం ప్రకారం…. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. దేశానికి తొలి దళిత ప్రధానిగా ఖర్గే కావచ్చని వాళ్లు చెప్పారని అన్నారు. కానీ దానిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం జరగలేదని నితీశ్ ను బుజ్జగించినట్టు తెలుస్తోంది.
కూటమిలో నితీశ్ పాత్ర చాలా ప్రధానమైనదని ఈ సందర్బంగా రాహుల్ గాంధీ అన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నితీశ్ కుమార్ మెత్తబడ్డారని వెల్లడించాయి. ఫోన్ సంభాషణలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ గురించి చర్చకు వచ్చిందన్నాయి. కేబినెట్‌లో మరి కొంత మంది కాంగ్రెస్ నేతలను చేర్చుకుంటామని నితీశ్ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నాయి.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వైపు నుంచి స్పష్టత రాకపోవడంతోనే కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతోందని ఈ సంరద్బంగా సీఎం వివరించినట్టు చెప్పాయి. ఇటీవల ఇండియా కూటమి అభ్యర్థిగా ఖర్గేను ప్రకటించడం, సమావేశంలో నితీశ్ కుమార్ మాట్లాడుతుండగా డీఎంకే నేత అడ్డు తగలడం, ప్రసంగాన్ని తమిళ్ లోకి అనువదించాలని కోరారు. దీంతో డీఎంకే నేతను నితీశ్ కుమార్ మందలించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో నితీశ్ అలక వహించారని వార్తలు వచ్చాయి.