కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రైల్వే కూలీ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ (Anand Vihar) రైల్వే స్టేషన్ (Railway Station) లో కూలీల మాదిరిగా ఎర్ర చొక్కా వేసుకుని చేతికి బ్యాడ్జి ధరించారు. కాసేపు కూలీల మాదిరిగా ప్రయాణికుల సూట్ కేసులను మోశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకు ఏం జరిగిందంటే…. రాహుల్ గాంధీ ఈ రోజు ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఐస్ బీటీకి వెళ్లారు. అక్కడ కాసేపు రైల్వే కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో కూలీల దుస్తులు ధరించి వారిలో కలిసి పోయారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల ఆనందర్ విహార్ లోని రైల్వేలు కొందరు తమకు రాహుల్ గాంధీని కలవాలని ఉందని అన్నారు. ఈ విషయం కాస్త రాహుల్ గాంధీకి చేరడంతో ఆయన ఈ రోజు రైల్వే కూలీల వద్దకు వెళ్లారు. దీనిపై రైల్వే కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాహుల్ గాంధీ ఆనంద్ విహార్ కు అకస్మాత్తుగా వచ్చారని ఓ రైల్వే కూలీ తెలిపారు.
చాలా సేపు తమతో రాహుల్ గాంధీ మాట్లాడారని అన్నారు. ఆ సమయంలో తమ సమస్యల గురించి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. కూలీల అభ్యర్థన మేరకు రాహుల్ గాంధీ తమ యూనిఫామ్ ధరించారని మరో కూలీ చెప్పారు. తమ లేబర్ ఛార్జీలను పెంచేలా చూడాలని రాహుల్ గాంధీని కోరామన్నారు. తమకు మెడికల్ ఇన్స్యూరెన్స్ కల్పించాలని, ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రాహుల్ ను విజ్ఞప్తి చేశామన్నారు.