కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) పై ఏఐఎంఐఎం (Aimim)నేత మహమ్మద్ ఫర్హన్ (Mohammad Farhan) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాహుల్ గాంధీ తన కుక్కకు ‘నూరీ’ అని పెట్టడాన్ని ఆయన తప్పు బట్టారు. దీనికి ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
రాహుల్ ప్రవర్తించిన తీరు సిగ్గు చేటని ఆయన ఫైర్ అయ్యారు. ఇది ముస్లిం కూతుర్లందరినీ అవమానపరచడమేనని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది ముస్లిం కుటుంబాలు, ముస్లిం సమాజం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న వ్యతిరేక భావనను తెలియజేస్తోందని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఇటీవల గోవాలో ఓ పెంపుడు కుక్కను దత్తత తీసుకున్నారు.
దాన్ని ఢిల్లీకి తీసుకు వచ్చి తన తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చారు. తన పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియోను తాజాగా ఆయన షేర్ చేశారు. తాను తన కుటుంబంలోని ఓ కొత్త సభ్యున్ని పరిచయం చేయాలని అనుకుంటున్నట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నూరీ గోవా నుంచి నేరుగా తమ చేతుల్లోకి వచ్చిందని తెలిపారు. తమ జీవితాల్లో నూరీ ఓ సరికొత్త వెలుగుగా మారిందని ఆయన వీడియోలో పేర్కొన్నారు.
ఎలాంటి హద్దులు లేని ప్రేమ, రాజీలేని విధేయతను ఈ అందమైన జంతువు మనకు నేర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. మన ప్రేమను అన్ని జీవరాశులతో పంచుకుంటామని, వాటి రక్షణకు పాటుపడుతామని ఈ ప్రపంచ జంతు దినోత్సవం సందర్బంగా మనందరం ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.