ప్రధాని మోడీ (PM Modi)పై కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ఏకైక కులం ‘పేద కులం’ అయితే మరి ప్రధాని మోడీ ప్రతిసారి తాను ఓబీసీ అని ఎందుకు చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు. నల్లధనం, నోట్ల రద్దు, గతంలో వ్యవసాయ చట్టాలపైన ప్రధాన మోడీ చేసిన వాగ్దానాలన్నీ అబద్దాలేనని తెలిపారు.
చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ….. ప్రధాని మోడి ప్రతి సభలో మాట్లాడుతూ ఆయన ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తినని చెప్పుకుంటారని అన్నారు. కానీ తాను కుల గణన ప్రస్తావన తెచ్చిన ప్రతీ సారి… ఈ దేశంలో అసలు కులం అనేది లేదని ప్రధాని చెబుతున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఏకైక కులం గరీబ్ (పేదలు)అని చెబుతున్నారని అన్నారు. మోడీజీ.. ఒక వేళ దేశంలో ఏకైక కులం గరీబ్ అయితే మరి మీరు ప్రతీ సారి మీ కులం ఓబీసీ అంటూ ఎందుకు చెప్పుకుంటున్నారని ప్రధానిని ఆయన నిలదీశారు. ప్రధాని మోడీ ఇక్కడకు వచ్చి మీకు రూ.15 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మరి ఆ 15 లక్షలు రూపాయలు అందాయా అని ప్రశ్నించారు.
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతరించిపోతుందని గొప్పలు చెప్పారని మండిపడ్డారు. మరి నల్లధనం అంతమైందా అని ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారన్నారు. కానీ ఆ బిల్లును రైతులే స్వయంగా తిరస్కరించారని చెప్పారు. ఎవరు వాస్తవాలు మాట్లాడతారో, ఎవరు అసత్యాలు మాట్లాడతారో మీకు తెలుసున్నారు.