ఒలింపిక్ కాంస్య పతక విజేత, రెజ్లర్ భజరంగ్ పునియా (Bajrang Poonia)తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమావేశం అయ్యారు. హర్యానా జజ్జర్ జిల్లాలో వీరేంద్ర రెజ్లింగ్ అకాడమీలో పునియాతో ఆయన భేటీ అయ్యారు. ఇటీవల రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో అధ్యక్షునిగా బ్రిజ్ భూషణ్ సింగ్ అనుచరుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడం, సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించడం, అటు పునియా కూడా తన పద్మశ్రీ అవార్డును ప్రధాని నివాసం సమీపంలో ఫుట్ పాత్ పై పెట్టడం వంటి పరిణామాలు జరిగాయి.
తాను తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చి వేయాలని నిర్ణయించుకున్నానని పునియా చెప్పారు. లైంగింక వేధింపుల కేసులో పోరాటం చేస్తున్న తన సోదరీమణులు, కూతుళ్లకు న్యాయం జరిగే వరకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పద్మశ్రీని వెనక్కి తీసుకోబోనని తేల్చి చెప్పారు. స్టార్ రెజ్లర్ వినేష్ కూడా తన ఖేల్ రత్న, అర్జున అవార్డును తిరిగి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు.
ఈ క్రమంలో భజరంగ్ పునియాతో రాహుల్ గాంధీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా వుంటే రాహుల్ గాంధీ కేవలం తమ రెజ్లింగ్ ను చూసేందుకు వచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ కూడా రెజ్లింగ్ చేశారని వెల్లడించారు. ఒక రెజ్లర్ల రోజు వారీ కార్యకలాపాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చారని తెలిపారు.
మరోవైపు అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలన్న నిర్ణయంపై వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ…. ప్రస్తుత పరిస్థితులను చూసి తాను చాలా నిరాశ చెందానన్నారు. 2016లో సాక్షి మాలిక్ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుందన్నారు. అప్పుడు ప్రభుత్వం ఆమెను బేటీ బచావో బేటీ పఢావో ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన విషయం తనకు గుర్తుందన్నారు. ఈ విషయం తెలియగానే దేశంలోని మహిళలు చాలా సంతోష పడ్డారన్నారు. మళ్లీ ఇప్పుడు సాక్షి కుస్తీ నుంచి తప్పుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఈరోజు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నానన్నారు.