– పదేళ్లలో కేసీఆర్ ఎన్ని ఇళ్లు కట్టారు?
– బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియా
– డబ్బు అంతా కేసీఆర్ ఇంటికే చేరుతోంది
– పేదల భూములు లాక్కునేందుకే ధరణి
– ఇది దొరలకు, ప్రజలకు మధ్య యుద్ధం
– మంత్రులు దోపిడీదారులుగా మారారు
– కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించాలి
– మేం గెలిస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా
– బోధన్ సభలో రాహుల్ గాంధీ
కుటుంబ, అవినీతి పాలన వల్ల తెలంగాణ (Telangana) చాలా నష్టపోయిందని అన్నారు కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). బోధన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ (BJP), బీఆర్‌ఎస్ (BRS) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే పదేళ్లు ప్రజల తెలంగాణ ఉండబోతున్నదని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ రూ.1,200 ఉందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500 కే ఇస్తామన్నారు. తమ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను డైవర్ట్ చేసిందని.. రాష్ట్రంలో ప్రజల పాలన అనేదే కనిపించడం లేదన్నారు రాహుల్. బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియా పెరిగిపోయిందని.. వీటి ద్వారా వచ్చే డబ్బు అంతా కేసీఆర్ ఇంటికే చేరుతోందని ధ్వజమెత్తారు. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారని.. కమిషన్ ఇవ్వనిదే పథకం ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. పేదల భూములు లాక్కునేందుకే దొరల సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చిందని విమర్శించారు.
దొరలకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్న రాహుల్.. కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని.. బీఆర్ఎస్ మళ్ళీ అధకారంలోకి వేస్తే భూములు గుంజుకుంటారని విమర్శించారు. కేసీఆర్ చదువుకున్న పాఠశాల కాంగ్రెస్ పార్టీ కట్టిందేనని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దోపిడీదారులుగా మారారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీని తరిమికొట్టాలని.. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. కారు టైర్లు కాంగ్రెస్ పంచర్ చేయనుందని.. తర్వాత ఢిల్లీకి వెళ్లి మోడీని పంచర్ చేస్తానని స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు చేసి రైతులను మోసం చేసిందన్నారు రాహుల్ గాంధీ. తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని.. ప్రభుత్వ ఇంటిని తొలగించారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని.. అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్ ఒకటే అని వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎంతమందికి వచ్చాయని అడిగారు. కాంగ్రెస్ గెలిస్తే.. సాగుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అసలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని.. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.